వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు కడపలోని ఇడుపులపాయలో జరిగిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో పాల్గొన్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల వివరాలను పూర్తిగా అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినట్లుగా తెలుస్తోంది. బొత్స ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధిష్టానం వారి వివరాలు కోరినట్లుగా చెప్పారు. కాంగ్రెసు వారి పూర్తి వివరాలు కోరినందున తాను జగన్ ప్లీనరీలో పాల్గొన్న 21 మంది ఎమ్మెల్యులు, 6 మంది పార్లమెంటు సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీల పూర్తి వివరాలను వీడియో ఫుటేజ్‌తో పంపించనున్నట్లు చెప్పారు.
కాంగ్రెసు టిక్కెట్ పై గెలిచి జగన్ పంచన పార్టీ నేతలు చేరటంతో ఇతర పార్టీలు సైతం ఆ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని, పార్టీ నుండి కుప్పిగంతులు నిరోధించే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్లీనరీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియో ఫుటేజిలను అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. ఇప్పటికే నలుగురు జగన్ వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కాంగ్రెసు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే నోటీసులు పంపించిన నలుగురు శాసనసభ్యులపై వేటు వేయడం ద్వారా మిగిలిన శాసనసభ్యులను కాపాడుకునే దిశలో పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.