తెలంగాణ కాంగ్రెసు నేతలు కొత్త పార్టీ పెడతారా?

దీంతో టి-కాంగ్రెసు నేతలు ఇరుకున పడ్డట్టుగా తెలుస్తోంది. అధిష్టానాన్ని ఎదిరించిన తమకు రాజీనామాలు ఆమోదించిన అనంతరం మళ్లీ టిక్కెట్ ఇవ్వక పోవచ్చు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణపై అధిష్టానం నుండి ఎలాంటి స్పష్టమైన హామీ లభించక పోవడాన్ని సాకుగా చూపి తెలంగాణ కాంగ్రెసు పేరిట కొత్త పార్టీ స్థాపించి ప్రజలలోకి వెళ్లాలని పలువురు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టినప్పటికీ తెలంగాణ కోసం పార్టీపై ఒత్తిడి తీసుకు రావాలని వారు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త పార్టీ పెడితే ఎంతమంది వస్తారనే అనుమానం సైతం వారిని వెన్నాడుతోన్నట్లుగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు తన వెంటే ఉంటామని చెప్పిన చాలామంది ప్రజాప్రతినిధులు ఆ తర్వాత ఆయన వైపు చూడటం లేదు.
పార్టీలో ఉంటేనే ఆయన వెంట ఉంటామని చెప్పామని చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం వ్యక్తిగత ప్రభావం లేని తాము పార్టీ పెడితే ఎంతమంది వస్తారనే విషయంపైనా మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలను ఖండించారు. పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. ఒకవేళ తమ రాజీనామాలు ఆమోదించినప్పటికీ స్థానికంగా ఉన్న సెంటిమెంటు దృష్ట్యా రాజీనామా చేశామని పార్టీ భావించి తమకే టిక్కెట్ కేటాయించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ గురించి ఆలోచించక పోవడమే ఉత్తమంగా వారు పేర్కొంటున్నారు. అయితే అధిష్టానం సైతం తెలంగాణపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంశాన్ని నాన్చితే లాభం లేదని త్వరగా తేలుస్తేనే మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications