కెసిఆర్‌కు, చెల్లె రాములమ్మకు ఎంత దూరం?

విజయశాంతి కెసిఆర్ తీరుపై కలత చెందడానికి కారణాలున్నాయి. తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్న కెసిఆర్ కాంగ్రెసును నమ్ముతున్నారని ఆమె అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసును ఎండగట్టడంలో కెసిఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ అంటున్నారు. నిజానికి, విజయశాంతి కెసిఆర్‌కు దూరం కావడం ఇప్పుడే జరిగింది కాదు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆమె తెరాసకు దూరమయ్యారు. ఆమెను పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానించడం మానేశారు. ఆమె కాంగ్రెసులోకి వెళ్లిపోతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆ స్థితిలో ఆమె తెరాసకు పూర్తిగా దూరమయ్యారు. వైయస్సార్ మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో ఆమె తిరిగి తెరాసకు దగ్గరయ్యారు.
తెరాసకు దగ్గరైనప్పటికీ ఆమెకు మునుపటి గౌరవం లభించడం లేదు. తన చెల్లెగా విజయశాంతిని అభివర్ణిస్తూనే కెసిఆర్ మాట్లాడేందుకు ఆమెకు వేదికను కల్పించడం లేదు. తెరాస బహిరంగ సభలో విజయశాంతి కెసిఆర్ పక్కనే కూర్చుంటున్నారు. కానీ ఆమెకు ప్రసంగించే అవకాశం ఇవ్వడం లేదు. గతంలో నరేంద్రకు అటువంటి అవకాశం ఇచ్చి పొరపాటు చేశానని కెసిఆర్ భావించి ఆమెకు దాన్ని నిరాకరిస్తూ ఉండవచ్చు. కెసిఆర్‌కు విజయశాంతి మనసు కూడా తెలుసునని అంటున్నారు. దానివల్లనే పూర్తిగా దూరం చేసుకోకుండా పూర్తిగా సొంతం చేసుకోకుండా విజయశాంతి పట్ల వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయశాంతి పార్టీలో కొంత ఇబ్బందికరంగానే కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications