చిరంజీవి భవిష్యత్తు ఏమిటి?

చిరంజీవికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీలేమిటో, ఆయనకు వేయదలుచుకున్న కుర్చీ ఏమిటో తెలియదు. కానీ అత్యంత ప్రముఖమైన పదవి లేదా బాధ్యత మాత్రం చిరంజీవికి వస్తుందని అంటున్నారు. చిరంజీవికి అనూహ్యమైన పదవి లభిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తారని, పార్టీ దక్షిణ భారత సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. తానే ప్రచార సారథిని అని చిరంజీవి ప్రకటించుకున్నారు కూడా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకునే తాత్కాలిక ప్రయోజనం కోసమే కాకుండా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునే దీర్షగాలిక ప్రయోజనం ఆశించి చిరంజీవిని కాంగ్రెసు పార్టీ కులుపున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో ఉండే కుల వైరుధ్యాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా చిరంజీవి దీటైన జవాబు ఇవ్వగలరని భావిస్తున్నారు.
కాగా, కాంగ్రెసు పార్టీలో తనతో ఇప్పటి వరకు ఉన్నవారందరికీ సముచిత స్థానం లభిస్తుందని చిరంజీవి హామీ ఇస్తున్నారు. కానీ అది ఏ మేరకు సాధ్యమవుతుందో చెప్పలేం. కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఉంటుంది. ఇప్పటికే కొంత మంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు వైయస్ జగన్, చంద్రబాబుల వైపు చూస్తున్నారు. జ్యోతుల నెహ్రూ వైయస్ జగన్ వెంట నడవడానికి నిర్ణయించుకోగా, చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రా రెడ్డి తెలుగుదేశంలో చేరిపోయారు. తెలంగాణలో చిరంజీవి క్యాడర్, అభిమానులు కెసిఆర్ వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు అనిల్ కుమార్, మహేశ్వర రెడ్డి చిరంజీవితో ఉన్నా, భవిష్యత్తులో ఉంటారా అనేది అనుమానమే. పదవులు వస్తాయనే ఆశతో ఇంకా ఎక్కువ మంది బయటపడడం లేదు. ఒక్కసారి చిరంజీవికి, చిరంజీవితో ఉన్నవారికి లభించే ప్రాధాన్యం నిర్ణయమైతే పరిస్థితులు ఇంకా మారవచ్చు. ఏమైనా, చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టినట్లే.