జగన్‌కు 'భూ'ప్రకంపనల వణుకు

వైయస్ జగన్ జగతి పబ్లికేషన్స్‌లోకి, ఇతర సంస్థల్లోకి పెట్టుబడులు ఆ వ్యవహారాల వల్లనే ప్రవహించాయనే అభిప్రాయం కూడా ఉంది. ఆ విధంగా వైయస్ ఐదేళ్లలో లక్ష ఎకరాలు కేటాయించారని అంటున్నారు. అది కూడా తక్కువ ధరకు కేటాయింపులు జరిపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ భూముల కేటాయింపులను సమీక్షించడం ద్వారా వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహాన్ని ఆపడానికి వీలవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, వైయస్ హయాంలో జరిగిన తప్పుల వల్ల ప్రభుత్వం నష్టపోయిందనే అభిప్రాయాన్ని ముందుకు తేవడానికి అవకాశం కలుగుతుంది. తన తండ్రి వైయస్ పథకాలను ఆసరా చేసుకుని వైయస్ జగన్ రాజకీయాలు నడపాలని భావిస్తున్నారు. వైయస్ విధానాలపై నీలినీడలు అలుముకునేలా చేయడం వల్ల జగన్ రాజకీయాలకు బ్రేకులు వేయడానికి వీలువుతుందని అంటున్నారు.
సంస్థలకు పెద్ద యెత్తున భూములు కేటాయిండం ద్వారా అవి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి వీలు కల్పించారు. ఈ వ్యవహారాల్లో ఏదో మేరకు వైయస్ జగన్ లాభం పొందినట్లు చెబుతున్నారు. అటువంటి వ్యవహారంపై ఈనాడు దినపత్రిక బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. బెంగళూర్‌లో 400 కోట్ల రూపాయల అత్యాధునిక సౌధాన్ని వైయస్ జగన్ సొంతం చేసుకున్నారని, అందుకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం చెల్లించిందంటూ ఈనాడు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనం ప్రకారం - బెంగళూరులో కీలకమైన బన్నేరుఘట్ట రోడ్డులోని అధునాతన ఐటీ సౌధం 'కామర్స్ @ మంత్రి'ని జగన్ సొంతగా పైసా కూడా ఖర్చు పెట్టకుండా హస్తగతం చేసుకుంటే.. తన అధికార మంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించి ఆ 'మంత్రి' సంస్థకు హైదరాబాద్‌లో 250 ఎకరాలు చౌకగా దక్కేలా చూశారు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అక్కడ అబ్బాయి జగన్ ముచ్చటపడి కోటను దండుకుంటే దానికి ప్రతిఫలాన్ని ఇక్కడి ప్రభుత్వం ద్వారా కట్టబెట్టారు తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. ఈ వ్యవహారంపై సవివరమైన వార్తాకథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది.
వైయస్ రాజశేఖర రెడ్డి జరిపిన ప్రతి భూకేటాయింపులో కుంభకోణం చోటు చేసుకుందని ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది. ఇలా వైయస్ జగన్ సంపాదన అనతి కాలంలో భూరీగా పెరిగన వైనంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలతో పాటు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీన్ని కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని ఆదిలోనే తుంచేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పటికే, మంత్రి పి. శంకరరావు రాసిన లేఖపై వైయస్ జగన్ ఆస్తులపై హైకోర్టు విచారణ జరుపుతుండగా, తాజాగా తెలుగుదేశం పార్టీ వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై కూడా విచారణ జరుపుతోంది. మొత్తం మీద వైయస్ జగన్ దాడుల నుంచి ఎలా భయపడుతారనేదే ఆసక్తికరంగా మారింది.