ఉపఎన్నికలు: టిఆర్ఎస్‌కు 'బిజెపి' ఊరట!

నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డికే మద్దతు ఇస్తుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్, కొల్లాపూర్‌లలో బిజెపి పోటీ చేయకపోవచ్చనని తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, గంప గోవర్ధన్, రాజయ్య, జూపల్లి కృష్ణా రావులకే మద్దతు ఇవ్వడానికి పార్టీ అంతర్గతంగా ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా తెలంగాణ కోసమే పదవులకు రాజీనామా చేసినందున మద్దతివ్వాలని బిజెపిని తెలంగాణ జెఏసి కోరిన విషయం విదితమే. ఈ ఒక్క కారణాన్నే ప్రజలకు చెబుతూ వారికి మద్దతిచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ కారణాన్ని చెప్పడం వల్ల తమకు జెఏసిలో శత్రువుగా మారిన టిఆర్ఎస్ పేరును నేరుగా ఉచ్ఛరించకుండా ఉన్నట్లవుతుందన్నది బిజెపి భావన. అయితే మహబూబ్‌నగర్‌లో తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరినా, టిఆర్ఎస్ అంగీకరించకపోవడం పట్ల బిజెపి గుర్రుగా ఉంది. ఇక్కడ మాత్రం తాడోపేడో తేల్చుకోవాలన్న కృత నిశ్చయంతో బిజెపి ఉందని సమాచారం.
మహబూబ్‌నగర్‌లో పార్టీకి కొంత పట్టు ఉందని, టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బిజెపి చెబుతోంది. అందుకే టిఆర్ఎస్ మద్దతు లేకపోయినా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు తెలిపారు. మండలానికి నలుగురు చొప్పున ఇన్‌చార్జులను నియమించే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బిజెపి పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. పోటీకి ఇద్దరు నేతలు సుముఖత వ్యక్తం చేసినా మూడు ప్రధాన పార్టీల నుంచి హేమాహేమీలు పోటీ పడుతున్నందున తట్టుకునే శక్తి ఉండదని బిజెపి భావిస్తోందని తెలుస్తోంది.