సుదీర్ఘ కసరత్తు: వ్యూహాత్మకంగానే జగన్ అరెస్ట్

అక్రమాస్తుల కేసు దర్యాప్తునకు సిబిఐ అధికారులు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలో మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేటింగ్ బృందంతో పాటు మరికొన్ని ఉప బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. చార్టెడ్ అకౌంటెంట్లు, మాజీ పోలీసు అధికారులు, బ్యాంకర్లు, ఆదాయపు పన్ను శాఖాధికారుల సేవలను కూడా సీబీఐ వినియోగించుకుంది. వేల కోట్ల రూపాయల కుంభకోణం కావడంతో అన్ని కోణాల్లోనూ అక్రమాలపై దర్యాప్తు జరిపింది.
తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నుంచి మేళ్లు చేయడం ద్వారా జగన్ కంపెనీలోకి పెట్టుబడుల ప్రవాహం జరిగిన తీరు, నల్లడబ్బును సక్రమమైనదిగా చూపడానికి పేపర్ కంపెనీలు, బ్రీఫ్‌కేసు కంపెనీలను సృష్టించడం వంటి అంశాలపై తీవ్రంగా దృష్టి సారించింది. కేసు దర్యాప్తు, సోదాలు, నిందితుల విచారణ, సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేయడం, డాక్యుమెంట్ల పరిశీలన, చార్జిషీట్ల రూపకల్పన వంటి పనులను వివిధ బృందాలు వేర్వేరుగా పర్యవేక్షించాయి.
ఇదే సమయంలో ఇతర కేసుల పైనా దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు ఆటంకం కలగకుండా చూశారు. వరుస చార్జిషీట్లను వేయడంతో పాటు ప్రతి దానిలోనూ జగన్‌ను ప్రథమ ముద్దాయిగా, విజయ సాయి రెడ్డిని రెండో ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జగన్ కంపెనీలకు ప్రయోజనం కలిగించే విధంగా జీవోల జారీతో సంబంధమున్న మంత్రులు, ఐఏఎస్ అధికారుల్ని కూడా సిబిఐ విచారించింది.
వందలకొద్ది సాక్షులను విచారించిన తర్వాతే నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మనంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసింది. ఇక, అ జాబితాలో మరికొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి తొలుత అరెస్టయ్యారు. ఆస్తుల కేసులో జగన్ అరెస్టు ఐదవది.
విచారణ సమయంలో సిబిఐ వ్యూహాత్మకంగా జగన్‌ను అరెస్టు చేసినట్లుగా కనిపిస్తోంది. 28న కోర్టుకు హాజరయ్యే ముందు తమ ఎదుట వివరణకు 25న హాజరు కావాలని జగన్‌కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న జగన్ విచారణకు హాజరయ్యారు. అయితే అదే రోజు ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే సిబిఐ అతనిని 25న గానీ, ఆ తర్వాత 26వ తేదిన గానీ అరెస్టు చేయలేదు.
రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జగన్‌ను విచారించి వదిలిపెట్టింది. రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, అంతా అదుపులోకి వచ్చాక వ్యూహాత్మకంగా అరెస్టు చేయాలని సిబిఐ భావించి ఉంటుందని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగా రెండు రోజుల పాటు జగన్‌ను ప్రశ్నించి వదిలేశారు. మూడు రోజు కూడా అలాగే చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పరిస్థితి తారుమారయింది. సిబిఐ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసిందనే ప్రచారం జరిగింది.
సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో పోలీసులను అప్రమత్తం చేయడం, హై అలర్ట్ ప్రకటించడం, భద్రతా బలగాలని పెంచడం, వైయస్సార్ కాంగ్రెసు నేతల హడావుడి, సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ యువనేతను విచారించిన అనంతరం ఒక్కరే ఓ హోటల్‌కు వెళ్లి సిబిఐ ఉన్నతాధికారులతో చర్చించడం తదితర పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. దీంతో జగన్ అరెస్టు ఖాయమని అందరికీ అర్థమైపోయింది. సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జగన్ అరెస్టును సిబిఐ ప్రకటించింది.












Click it and Unblock the Notifications