జగన్-మజ్లిస్ దోస్తీ: ఆజాద్‌తో వైయస్‌కు చెల్లుచీటి

ఆరోగ్యశ్రీ, 108, 104... ఇలా ప్రతి పథకాన్ని తన తండ్రి పథకంగా జగన్ చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెసు పథకాలే అయితే మిగిలిన కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశ్నిస్తోంది. పథకాలపై కాంగ్రెసు పార్టీ కూడా మొదటి నుండి జగన్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. అవి కాంగ్రెసు పథకాలని, ముఖ్యమంత్రిగా ఎవరున్నా వాటిని అమలుపర్చుతామని, పథకాలు ఏ ఒక్కరికో చెందినవి కావని... పార్టీవిగా చెప్పుకొస్తున్నారు.
పథకాలపై కాంగ్రెసు పార్టీ ఎదురుదాడి కొంతలో కొంతైనా ప్రభుత్వానికి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. లేదంటే అంతకుముందు ఆ పథకాలను పూర్తిగా వైయస్‌విగా భావించే వారు. కానీ ఇప్పుడిప్పుడే క్రమంగా కాంగ్రెసు పథకాలుగా ప్రజల్లో నానుతున్నవి. ఇదే సమయంలో పుష్కరకాలంగా రాష్ట్రంలో కాంగ్రెసుతో కలిసి ఉన్న మజ్లిస్ పార్టీ జగన్‌తో దోస్తీకి తహతహలాడుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెసుకు తమ మద్దతును ఇటీవల ఉపసంహరించుకున్నారు.
ఆ సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ది కోసం వైయస్ ఎంతో చేశారని, నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని ప్రశంసలు గుప్పించారు. మజ్లిస్ కేవలం హైదరాబాదులోనే కీలకంగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతుంది. నాలుగు శాతం రిజర్వేషన్ వైయస్‌ది అని మజ్లిస్ చెప్పడంతో ఇన్నాళ్లు తమకు అండగా ముస్లిం ఓటర్లు ఎక్కడ దూరం అవుతారోనని భావించిన కాంగ్రెసు నిన్న నిర్వహించిన సదస్సులో ఆ క్రెడిట్ తమదిగా చెప్పుకునే ప్రయత్నాలు చేసింది.
నాలుగు శాతం రిజర్వేషన్‌లు ప్రకటించినప్పుడు కాంగ్రెసు నేతలు వైయస్‌ను పొగిడారు. ఇప్పుడు వైయస్‌ను జగన్ సొమ్ము చేసుకుంటుండటం, మజ్లిస్ తమకు దూరమవడంతో ఆలస్యంగానైనా మేలుకున్న కాంగ్రెసు పార్టీ అన్ని పథకాల్లాగే రిజర్వేషన్ క్రెడిట్ కూడా తమదే అని సదస్సులో చెప్పింది. ముస్లింలకు రిజర్వేషన్‌కు కారకులు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అని చెప్పారు. ఆజాద్ వల్లే ఇది సాధ్యమైందని కితాబిచ్చారు.
ఆజాద్ ముస్లిం నేత. కాబట్టి ఆయనకు ఆపాదించడం ద్వారా 4 శాతం రిజర్వేషన్ క్రెడిట్ కాంగ్రెసుదిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మరింత సులభంగా ఉంటుందనే భావనతో కాంగ్రెసు ఉందని అంటున్నారు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన ప్రకారమే అని కాంగ్రెసు నేతలు నిన్నటి సదస్సులో గొంతెత్తి చెప్పారు.












Click it and Unblock the Notifications