కిరణ్ కుమార్ రెడ్డి తాజా టార్గెట్ దామోదర

మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఆయన ప్లాన్ వేసి అమలు చేస్తున్నట్లు సమాచారం. రాజనర్సింహకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న సురేందర్ గౌడ్‌ను ఎసిబి అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దాంతో సరిపెట్టకుండా రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎసిబి ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుంది. అటువంటప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా మద్యం సిండికేట్ల వ్యవహారంలో దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని అనుకోవడానికి వీలు లేదు. పైగా, మంత్రులనే ఎసిబి టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. పార్టీలోని అంతర్గత శత్రువులను మానసికంగా దెబ్బ తీసి తనకు పోటీ లేకుండా చేసుకునే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఎసిబి దాడులను వాడుకుంటున్నారని పార్టీలోని వారు కూడా అంటున్నారు.
బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారిద్దరు పార్టీలోని అసమ్మతికి కేంద్ర బిందువుగా మారుతున్నారని ముఖ్యమంత్రి అనుమానిస్తున్నారు. దీంతోనే వారిద్దరిని ఆయన లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. మొదట ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను లక్ష్యం చేసుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి సన్నిహితుల నుంచే దాని పట్ల వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వక తప్పలేదని అంటున్నారు. ఈ స్థితిలో తనకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్న నేతలను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications