వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వారసత్వంలో ఎందరిలోనో జగన్ 'ఒక్కడు'?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, దేశంలో మరెందరో ఇలాంటి అవినీతికి పాల్పడ్డారని ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. కథనం ప్రకారం.. "వైయస్ ఒక్కరే అవినీతికి పాల్పడ్డారా? ఇంకెవరూ తప్పు చేయలేదా? ముఖ్యమంత్రులు, మంత్రుల వారసులు సొమ్ములు బొక్కేయలేదా? జగన్ ఒక్కడే తిన్నాడా?''... ఇవీ కొందరు సంధించే ప్రశ్నలు! నిజమే!

రాజకీయ వారసత్వం ఎంత సహజమో... అవినీతి వారసత్వం కూడా అంతే సహజంగా వచ్చిన ఉదంతాలు కోకొల్లలు! కాకపోతే... ఎంత తిన్నారు? ఏ స్థాయిలో బరి తెగించారు? అనేదానిలోనే తేడా! ఆ విషయానికొస్తే... జగన్‌కు ఎవరూ సాటిలేరనే చెప్పవచ్చు. మీరే చూడండి! తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధుల్ని కైంకర్యం చేయడం, రాజ్యాంగాతీత శక్తిగా మారడం! జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఈ 'రాజకీయ ఒరవడి'కి ఆద్యులు చాలామందే ఉన్నారు. ఇందిరా గాంధీ అధికారంలో ఉండగా ఆమె కుమారులు, అందులోనూ ముఖ్యంగా సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించి తల్లిని మించిన అధికారాన్ని చలాయించారు.

ఆ రోజుల్లో అవినీతి రాజ్యం ఏలింది. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చీ రాగానే తాను 'నిష్కల్మష' నాయకుడినని చెప్పుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తెగా ప్రధాని పదవిని చేపట్టిన ఇందిరా గాంధీ తాను నిష్కల్మషమైన నాయకురాలినని ఏనాడూ చెప్పుకోలేదు. పైపెచ్చు 1983లో ఆమె బహిరంగంగానే 'అవినీతి అనేది విశ్వవ్యాప్త ప్రక్రియ' అని ప్రకటించారు. ఆమె ఇచ్చిన ప్రకటన కారణంగానో ఏమో, ఆమె మీద ఆ తరువాత ఎవరూ అవినీతికి సంబంధించిన ఆరోపణ చేయలేదు. తాను అవినీతికి అతీతురాలినని ఆమె ఏనాడూ చెప్పలేదు మరి! కానీ, రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చీ రాగానే తాను 'నిష్కల్మషమైన నాయకుడిని' అని ప్రకటించారు.

1989 నాటి ఎన్నికల్లో బోఫోర్స్ శతఘ్ని ఆయన ప్రభుత్వాన్ని పేల్చేసింది. దరిమిలా, రాజకీయాలు నేర్పిన పాఠమేమిటంటే... నువ్వు అవినీతి పరుడివైనప్పుడు, నీకు అవినీతి అంటే పడదు అని చెప్పుకోవద్దు. సోనియా గాంధీ తన అత్తగారిలా 'అవినీతి చాలా సహజమైన వ్యవహారం' అని చెప్పుకోకుండా... రాజీవ్ గాంధీ నడిచిన ముళ్లబాటలోనే నడిచే ప్రయత్నం చేశారు. 2010 నవంబర్‌లో సోనియా గాంధీ అలహాబాద్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, 'అవినీతిని మా ప్రభుత్వం భరించలేదు' అని స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఢిల్లీలో పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ అదే విధమైన ప్రకటన చేశారు. అవినీతిపరులు ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పదవుల్లో ఉన్నాసరే ముఖాముఖి ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. అవినీతిపరుల ఆటకట్టించడంలో తమ పార్టీ, ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉపేక్షించదని, అవినీతి వల్ల దేశ పురోగతి దెబ్బ తింటుందని ఆమె నొక్కి చెప్పారు. తాను నిష్కల్మషమైన నాయకుడినని రాజీవ్ గాంధీ ప్రకటించినప్పుడు, ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణలూ లేవు.

కానీ, సోనియా ఆ ప్రకటన చేసినప్పుడు మాత్రం ఆమె పీకల లోతు ఆరోపణల్లో మునిగి తేలుతున్నారు. కామన్వెల్త్‌గేమ్, ఆదర్శ్, 2జీ స్ప్రెక్ట్రమ్ వంటి ఆరోపణలు అప్పటికే ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. అసలు ఆమె మీదే లంచాలు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. స్విస్ బ్యాంక్‌లో లంచాలు, ముడుపుల కింద ఆమె కుటుంబ సభ్యుల పేరున కోట్లాది డాలర్ల నిధులు మూలుగుతున్నట్టు ఓ స్విస్ మేగజైన్ ప్రకటించింది. అంతేకాదు, ఓ రష్యా పరిశోధనాత్మక పాత్రికేయుడు కూడా ఆమె బ్యాంక్ బ్యాలెన్స్‌ల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి తెచ్చాడు.

తమ బ్యాంకుల్లో సోనియా గాంధీ కుటుంబ సభ్యుల ఖాతాల్లో సుమారు 220 (రూ. 80,000 కోట్ల రూపాయలు) కోట్ల డాలర్ల నుంచి 1,100 కోట్ల డాలర్ల వరకు నిధులు మూలుగుతున్నట్టు సాక్షాత్తూ స్విస్ బ్యాంకులే బయటపెట్టాయి. ఇవన్నీ అబద్ధాలని ఆమె ఇంతవరకూ చెప్పలేదు. ఆ బ్యాంకుల మీద గానీ, ఆ పాత్రికేయుడి మీద గానీ ఆమె చట్టపరంగా చర్య తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పట్లో ఆమె మైనర్ కుమారుడు రాహుల్ గాంధీ పేరు మీద కూడా నిధులున్నట్లు స్విస్ బ్యాంక్ వెల్లడించింది.

కొద్ది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన కృపాశంకర్ సింగ్ తన కుమారుడు నరేంద్ర కుమార్ సింగ్ కోసం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఆ పదవిలో కొద్ది కాలమే ఉన్నా ముంబయ్, పుణేలలో 70 వరకూ ఇళ్లు కొనుగోలు చేశాడు. ముంబయ్‌లో కీలకమైన, ప్రధానమైన ప్రదేశాల్లో 15కు పైగా స్థలాలను సంపాదించాడు. మహారాష్ట్రలో అనేక ప్రాంతాలలో తోటలు కొన్నాడు.

బంగారానికి మితి లేదు. వీటి విలువ రూ. 320 కోట్ల పైచిలుకేనని అప్పట్లో ఈ కేసును పరిశోధించిన ఏసీపీ రాజ్‌వర్ధన్ సిన్హా వెల్లడించారు. హర్యానా లోక్‌దళ్ నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా కూడా తన కుమారులు అజయ్, అభయ్‌ల కోసం తమ రాష్ట్రాన్ని రూ. 450 కోట్ల రూపాయల మేరకు దోచుకున్నట్టు వెల్లడైంది. అప్పటికి... ఆ రాష్ట్ర బడ్జెట్ కూడా రూ. 450 కోట్లు ఉండదు. ఇక తమిళనాడు రాష్ట్ర సీఎంగా పనిచేసిన కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్‌లు రాష్ట్రాన్ని రెండు భాగాలుగా పంచుకుని, చెరొక వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నట్టు 2008 ప్రాంతంలో వార్తలు వెల్లువెత్తాయి.

ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన మురసోలి మారన్ తన కుమారులకు సుమారు రెండు వేల కోట్ల రూపాయల మేరకు ఆస్తులు సమకూర్చిపెట్టినట్టు వెల్లడైంది. ఆయన చలవ వల్లే ఆ తరువాత కేంద్రంలో మంత్రి అయిన దయానిధి మారన్ అవినీతి ఆరోపణల కారణంగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్‌పైనా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

ములాయం సీఎంగా ఉండగా అఖిలేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడని... లక్నో, ఢిల్లీ, ముంబయ్ నగరాల్లో ఇళ్లు, స్థలాలు, పరిశ్రమలు కొనుగోలు చేశాడని రెండేళ్ల క్రితం వార్తాపత్రికలు వెల్లడించాయి. మొత్తం మీద అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుమారులు కుబేరులైపోవడమో లేక కుమార రత్నాలే తెరవెనుక నుంచి పాలన సాగించి కోట్లు గడించడమో ఓ సహజ విధానంగా మారిపోయింది.

అయితే, తేడా ఏమిటంటే, పుత్రరత్నాలంతా తమ సంపాదనని వందల కోట్లకు పరిమితం చేయగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని ఆయన కుమారుడు దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు ఆస్తులు సంపాదించుకున్నారంటూ సమాచారం వెల్లువెత్తడం ఓ కొత్త ఒరవడికి నాంది పలికినట్లయింది.

English summary
Leading Telugu daily wrote a article on YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's corruption. In this article.. not only Jagan used his father for corruption and many were in country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X