• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్ గాంధీ వెనక్కి: సోనియా ముందుకి

By Pratap
|

Sonia Gandhi - Rahul Gandhi
న్యూఢిల్లీ: తన కుమారుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టి సోనియా గాంధీయే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారనే ఉహాగానాలు ఢిల్లీలో గుప్పుమంటున్నాయి. 2014లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే వ్యూహానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయంటూ వార్తలు కూడా వెలువడుతున్నాయి.

ఇటీవల బీజేపీ సీనియర్ నేత అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీల మధ్య జరిగిన వాగ్వాదాన్ని పరిశీలకులు మామూలు తీసుకోవడం లేదని అంటున్నారు. చట్టవ్యతిరేక ప్రభుత్వం అంటూ లోక్‌సభలో యూపీఏ మీద అద్వానీ వ్యాఖ్యానించడం, రాజకీయ జీవితంలో మొదటిసారిగా సోనియా రెచ్చిపోయి ప్రసంగించడం కాంగ్రెస్ నాయకులకే కాకుండా దేశ ప్రజలకు సైతం కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపించినట్లు భావిస్తున్నారు.

ప్రధాని పదవికి స్వయంగా సోనియా గాంధీయే అస్త్రం సంధించబోతున్నారని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలు కూడా దోహదం చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మంత్రిగా చిదంబరం నియామకం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉండదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గాంధీ-నెహ్రూ కుటుంబానికి విధేయుడైన దళిత నాయకుడు షిండేకు హోం శాఖ అప్పగించడం కూడా ఆలోచించాల్సిన విషయమే.

రాహుల్ గాంధీలో పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే సామర్థ్యం లేని కారణంగా సోనియా గాంధీయే రాజకీయంగా పార్టీ పగ్గాలు పట్టుకోవాలని పార్టీ వ్యూహకర్తలు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంత వరకు రాహుల్ చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడమే అందుకు కారణమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సారథ్యంలో ప్రచారం జరుగుతుందని చెప్పినా పరిణామాలు మరో వైపునకు దారి తీస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులూ కాస్తో కూస్తో శక్తిని కూడగట్టుకుంటున్నది సోనియా గాంధీ పేరు విన్నప్పుడేనని నాయకులు భావిస్తున్నారు.

ఎంత ఎగదోసినా రాహుల్‌గాంధీ సారథ్య లక్షణాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని, పార్టీని ముందుండి నడిపించే స్థితిలో లేరని సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ అన్యాపదేశంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అపర చాణక్యుడుగా పేరు తెచ్చుకున్న ప్రణబ్ ముఖర్జీకి జనాన్ని ఆకట్టుకునే ప్రతిభ లేదు. ఫలితంగా ఆయనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సోనియా గాంధీకి ఉన్నంత కరిష్మా మరెవరికీ లేదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.

పార్టీలోని యువ ప్రతినిధులకు మాత్రం రాహుల్‌పై ఆశలు అడుగంటిపోలేదు. రాహుల్‌లో మేధావి లక్షణాలు ఎక్కువనీ, ఆయనకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి పార్టీ కార్యక్రమాలు అప్పగిస్తే నాయకత్వ లక్షణాలు వెలికి వస్తాయని జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకులు పార్టీ అగ్ర నాయకత్వానికి నచ్చజెబుతున్నారు. సోనియా గాంధీ ప్రచార సారథ్యం మాత్రమే చేపడతారని, పార్టీ విజయం తరువాత రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిని చేస్తారని, 2014లో కూడా సోనియా ప్రధాని పదవికి దూరంగానే ఉంటారని వారు గట్టిగా చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గనుక 150 లోపు సీట్లు లభించే పక్షంలో మళ్లీ సంకీర్ణ భాగస్వాముల్ని కూడగట్టుకోక తప్పదని, అప్పుడు పార్టీ అధిష్ఠానం మళ్లీ మన్మోహన్‌నే ప్రధానిని చేసే అవకాశం లేకపోలేదని యువ నాయకులు చెబుతున్నారు. పార్టీకి 225 కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి పట్టం కడతారని వారు భావిస్తున్నారు.

అంతేకాదు, లోక్‌సభలో అసోంపై చర్చలో ఆమె కల్పించుకోవడం కూడా ఊరికే జరగలేదు. పార్టీకి తానే నాయకురాలినని చెప్పడమే ఆమె ఉద్దేశంగా కనిపించింది. లోక్‌సభలో సోనియా మాట్లాడిన తీరు పార్టీ ఎన్నికల వ్యూహాన్ని తెర ముందుకు తెచ్చింది. మరో ముఖ్య విషయమేమిటంటే, రెండో దశ సంస్కరణలను వేగవంతం చేసే అవకాశాన్ని మన్మోహన్ సింగ్‌కు ఆమె ఇవ్వకపోవచ్చు.

తాను పగ్గాలు చేపట్టిన తర్వాతో లేక రాహుల్ గాంధీ ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడో సంస్కరణలను వేగవంతం చేసి ఆ ఖ్యాతిని తమ వంశం లేక తమ కుటుంబం చేజిక్కించుకునేలా చేయాలన్నది ఆమె ఆలోచన. మొత్తానికి తమ పార్టీకి సోనియా ప్రధాన ప్రచార సారథి కాబోతున్నారనడంలో సందేహం లేదు.

English summary
According to media reports - AICC president Sonia gandhi has in strategy toemerge herself as a candidature for PM post after 2014 general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X