జైపాల్ రెడ్డిపై కి'రణం' ఎందుకు?

Kiran Kumar Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు యుద్ధం ప్రకటించారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జైపాల్ రావడానికి ఇష్టపడకపోవడం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డికి పదవి దక్కింది. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తనకు అత్యంత సన్నిహితుడైన కె. జానా రెడ్డిని కూడా కాదని జైపాల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

అయితే, జైపాల్ రెడ్డిపై రణం ప్రారంభించడానికి కిరణ్ కుమార్ రెడ్డిని పురికొల్పిన విషయాలేమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంటుకు గ్యాస్ మళ్లింపు అంశంపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై నిందలు వేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ విషయంలోనే జైపాల్ రెడ్డి పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ విషయం తానే ముఖ్యమంత్రికి చెప్పానని కూడా అన్నారు. తాను రాష్ట్రానికి చేసిన మేలును ఏకరువు పట్టారు.

జైపాల్ రెడ్డిని నిందిస్తున్న సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తనకు అనుకూలంగా నిర్ణయం వచ్చేట్లు చూసుకుని పైచేయి సాధించారు. ఇప్పుడు తెలంగాణలోని నేదునూరు, శంకరపల్లి ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపు విషయంలో పెట్రోలియం శాఖపై ధ్వజమెత్తడమే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో జైపాల్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కావాలని జైపాల్ రెడ్డి మీద సమరం ప్రారంభించారనే అభిప్రాయం కలుగుతోంది.

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిని మార్చే విషయంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి జైపాల్ రెడ్డిని కలుసుకుని ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి కావడానికి జైపాల్ రెడ్డి సహాయం కోసం జానా రెడ్డి ప్రయత్నించారనేది అందరికీ తెలిసిన విషయమే. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా జైపాల్ రెడ్డితో ముఖ్యమంత్రి మార్పుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

జైపాల్ రెడ్డి ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం కిరణ్ కుమార్ రెడ్డిలో నాటుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ నాయకుల నుంచి కిరణ్ కుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే భావన నుంచి తాను బయట పడి జైపాల్ రెడ్డి వైపు మళ్లించే ప్రయత్నాలు కిరణ్ రెడ్డి చేశారని అంటున్నారు. తెలంగాణ నాయకులే తెలంగాణకు మేలు చేయడమే లేదనే అభిప్రాయాన్ని కలిగించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనను పసిగట్టిన కారణంగానే జైపాల్ రెడ్డి వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి లేఖకు ఘాటైన సమాధానం ఇప్పించారని అంటున్నారు. తమపై, జైపాల్ రెడ్డిపై చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పెట్రోలియం శాఖ తీవ్రంగా మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+