బాబు షేఫ్: నిలువునా చీలిన కాంగ్రెసు

రాష్ట్ర కాంగ్రెసు నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి రాజమండ్రి సదస్సుతో ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విభజన స్పష్టంగా వచ్చింది. సీమాంధ్ర నాయకులపై కాంగ్రెసు తెలంగాణ నేతలు మండిపడుతుంటే, మధు యాష్కీ వంటి తెలంగాణ నేతలపై సీమాంధ్ర నాయకులు ఉడికిపోతున్నారు. ఢిల్లీ రేపిస్టుల కంటే క్రూరులు సీమాంధ్ర నేతలు అని ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనవిషయంలో పార్టీలో వచ్చిన చీలికలపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కలవరపడుతోంది. రాజమండ్రి సదస్సుకు బొత్స సత్యనారాయణ హాజరు కావడం తెలంగాణ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో బొత్స సత్యనారాయణపై కూడా వారు మండిపడుతున్నారు. రాష్ట్ర నాయకత్వమే ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరు ప్రాంతాల నాయకులు ప్రాంతాలవారీగా నిలువునా చీలిపోయి విమర్శలు చేసుకోవడం అధిష్టానాన్ని కలవరపెట్టే దశకు చేరుకుంది.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజ్‌గోపాల్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, కెవిపి రామచంద్రరావులను బట్టలూడదీసి కొట్టాలని, వారే తెలంగాణను అడ్డుకొంటున్నారని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కిగౌడ్ నిప్పులు చెరిగారు.
ఉండవల్లి రాజమండ్రి సభ కాంగ్రెసులోని తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య స్పష్టమైన విభజనను తెచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారులను రజాకార్లతో పోల్చడం, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామంటూ అనడం తీవ్ర దుమారానికి దారి తీసింది. బొత్స సత్యనారాయణకు ఇప్పటి వరకు తెలంగాణ నాయకులు కొంత సానుకూలంగా ఉండేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఈ విభజన వచ్చిన స్థితిలో ఇరు ప్రాంతాల నాయకులు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలోపూర్తిగా చిక్కుల్లో పడినట్లే. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే తప్ప ఓ సంక్షోభం తలెత్తి, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవకాశం లభించవచ్చు.












Click it and Unblock the Notifications