మోడీ జట్టు రెడీ: ఐదుగురు తెలుగువాళ్లు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార సమరానికి గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మెడీ సిద్ధమయ్యారు. కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని చెప్పడానికి 20 కమిటీలను బిజెపిఏర్పాటుచేసింది. పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోదీ ఈ కమిటీలను నడిపిస్తారు. మోడీ జట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు నాయకులకు స్థానం లభించింది. ఈ వివరాలను శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత్‌కుమార్ మీడియాకు తెలిపారు.
కమిటీల్లో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, నిర్మలా సీతారామన్, హరిబాబులకు చోటు కల్పించారు. ఎన్నికల కమిటీకి ఎంపికైన వెంకయ్య నాయుడికి మాస్ క్యాంపెయిన్ పనులు అప్పగించారు. ర్యాలీలు, పార్లమెంటరీ సమ్మేళనాలు, మేధావులతో సమావేశాలు నిర్వహించటం మాస్ క్యాంపెయిన్‌లో భాగం.

దత్తాత్రేయ మేనిఫెస్టో కమిటీకి ఎంపిక కాగా , గుర్తించిన కొన్ని వర్గాలను పార్టీవైపు ఆకర్షించే టార్గెటెడ్ కాన్ఫరెన్స్ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నేతృత్వం వహిస్తారు. యుపిఎ వైఫల్యాలపై ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో నిర్మలా సీతారామన్ సభ్యురాలుగా ఉన్నారు. పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించే 'విజన్ కమిటీ'లో హరిబాబుకు అవకాశం దక్కింది. కాగా, మేనిఫెస్టో కమిటీకి కురువృద్ధ నేత మురళీ మనోహర్ జోషి, 'విజన్' కమిటీ, శ్రేణుల సన్నాహక కమిటీలకు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీలను నియమించారు.
మీడియా వ్యవహారాల కమిటీకి సుష్మా స్వరాజ్-అరుణ్ జైట్లీ, సమాచార ప్రచార (ట్విట్టర్లు, ఫేస్‌బుక్) కమిటీకి పియూష్ గోయల్, ఈశాన్య వ్యవహారాల కమిటీకి ఎస్ఎస్ అహ్లూవాలియా, ఈసీ-న్యాయ వ్యవహారాల కమిటీకి సత్యపాల్ జైన్, కరపత్రాలు, పోస్టర్లు, పుస్తకాలు, ఆడియో తయారీ పనిని బల్బీర్ పుంజ్, రవాణా వ్యవహారాలను అబ్బాస్ నక్వీలకు అప్పగించారు. ఇక ఢిల్లీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను నితిన్ గడ్కరీకి ప్రత్యేకంగా అప్పగించారు.












Click it and Unblock the Notifications