బాబు రివర్స్: జగన్ డైలమా, కాంగ్రెసు వేటు పోటు

ఈ స్థితిలో అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెసు పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అవిశ్వాస తీర్మానం ముదుకు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఒక వేళ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే శాసనసభ్యులపై వేటు మంత్రాన్ని ప్రయోగించాలని ఆలోచిస్తోంది. అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చేందుకు ఒక్క ఎమ్మెల్యే చాలు. అయితే, అది చర్చకు రావాలంటే 30 మంది శానససభ్యులు మద్దతు అవసరం. జగన్ పార్టీకి అధికారికంగా 17 మంది ఎమ్మెల్యేలున్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతింపజేసుకోవాలంటే మరో 13 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), మజ్లీస్ ఎమ్మెల్యేలు కలిసివస్తే పని సులువు అవుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు తెరాస వెనకాడుతోంది. మజ్లీస్ కూడా ప్రస్తుత స్థితిలో కాస్తా వెనకాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ స్థితిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధారపడాల్సి ఉంటంది. కాంగ్రెసుకు చెందిన సుజయ రంగారావు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పేర్ని నాని, గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రాదరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. మరో ఇద్దరు కూడా అంతర్గతంగా మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులు వైయస్ జగన్‌కు మద్దతు ఇస్తున్నారు.
అయితే, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను బలపరిచే జగన్ వర్గం శాసనసభ్యులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసి తీరాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. ప్రతిపాదనకు తగిన మద్దతు ఉన్నా, దాన్ని ఎప్పుడు చర్చకు తీసుకోవాలన్న విషయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం. చర్చకు రావడానికి ముందే వారిపై అనర్హత వేటు వేస్తే కాంగ్రెసు గట్టెక్కే అవకాశాలుంటాయి.
శాసనసభలో బలాబలాల తీరు..
కాంగ్రెస్ పార్టీకి 155 మంది శాసనసభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండానే అధికారికంగా వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్న ఏడుగురిలో ముగ్గురు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. అవి ఆమోదం పొందితే కాంగ్రెస్ బలం 152కు చేరుతుంది. మిగిలిన నలుగురిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడితే ఆ సంఖ్య 148కు చేరుతుంది. తెలుగుదేశం నుంచి వైదొలగిన కొడాలి నాని, వనిత, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, అమర్నాథరెడ్డి, సాయిరాజ్‌పైనా అనర్హత వేటు పడితే, ఆపార్టీ బలం 86 నుంచి 81కు చేరుతుంది.
ఇదే సమయంలో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య కూడా 294 నుంచి 280 అవుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 141 అవుతుంది. అనర్హత వేటు తర్వాత కాంగ్రెస్ బలం 148గా ఉంటుందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని పాలకపక్షం భావిస్తోంది. అయితే, తెరాస, మజ్లీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వస్తే మాత్రం ప్రమాదమే.












Click it and Unblock the Notifications