క్యాంపస్‌ల్లో ‘కాషాయానికి’ ఎదురుగాలి: జేఎన్‌యూ సంకేతం?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో కాషాయ వ్యతిరేక గాలులు వీస్తున్నాయా? విశ్వవిద్యాలయాల్లో ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు ఆదరణ పెరుగుతున్నదా? అంటే అవుననే అంటున్నాయి ఇటీవలి పరిణామాలు. దేశ రాజధాని నగరం 'హస్తిన'లో ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) గుర్తింపు ఎన్నికల్లో వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించగా, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం 'ఎన్ఎస్‌యూఐ' గెలుపొందింది.

రెండింటిలోనూ కాషాయ విద్యార్థి సంఘం.. ఆరెస్సెస్ మార్గదర్శకత్వంలోని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఓటమి పాలైంది. కేవలం విశ్వవిద్యాలయ రాజకీయాలే కాక దేశవ్యాప్త పరిణామాలు కూడా విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి.

గోరక్షణ పేరిట జరుగుతున్న హింస, ప్రభుత్వ నిర్ణయాలపై కొన్ని రంగాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, విద్య కాషాయీకరణపై విమర్శలు, సోషల్ మీడియాలో కక్కుతున్న విషయం తదితర అంశాలు విద్యార్థులను ఆలోచనలో పడేస్తున్నాయని వాటి ఫలితాలే యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన గౌరీ లంకేశ్ అనే జర్నలిస్టు హత్య కూడా లౌకిక శక్తులను సంఘటితపరిచిందని చెబుతున్నారు.

చర్చోపచర్చలు, అభిప్రాయ స్వేచ్ఛకు నిలయం జేఎన్‌యూ

చర్చోపచర్చలు, అభిప్రాయ స్వేచ్ఛకు నిలయం జేఎన్‌యూ

విద్యార్థుల మధ్య అభిప్రాయ స్వేచ్ఛ, సునిశిత విమర్శలు, చర్చోపచర్చలు, వాటి కార్యాచరణ సహజంగానే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మిగతా యూనివర్శిటీలకు భిన్నంగా నిలబెడుతున్నది. దేశంలో పాలకులు తీసుకు వచ్చే ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడంలో ముందు ఉంటుంది జేఎన్‌యూ. ఆరెస్సెస్ భావజాలం ఉన్న జగదీశ్ కుమార్ ను జేఎన్ యూ వీసీగా కేంద్ర ప్రభుత్వం నియమించడం.. ఆయన సాధారణ విద్యార్థులు చేరకుండా వివిధ కోర్సుల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 900కి తగ్గించడం వంటి చర్యలు సహజంగానే విద్యార్థుల్లో ఆగ్రహానికి హేతువయ్యాయి. ప్రశ్నించడాన్ని సహించలేకే కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల అణచివేత విధానాలకు పాల్పడుతున్నదని విద్యార్థుల్లో బలంగా ప్రచారం జరిగింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా మూడు ప్యానెళ్ల మధ్య సాగింది. కానీ ఏ ప్యానెల్ కూడా వామపక్ష విద్యార్థి సంఘాల కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 6620 మంది విద్యార్థుల ఓట్లు చెల్లుబాటయ్యాయి. మరో 19 మంది ఓట్లు చెల్లలేదు. బిర్సా అంబేద్కర్ పూలే విద్యార్థి సంఘం (బాప్సా)కు గణనీయంగానే ఓట్లు పోలయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల కూటమిగా బరిలోకి దిగాయి.

భారీ మెజారిటీతో లెఫ్ట్ కూటమి జయం

భారీ మెజారిటీతో లెఫ్ట్ కూటమి జయం

ఈ కూటమి కాకుండా ఏఎస్ఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, బాప్సా కూడా పోటీలో ఉన్నాయి. ఆఫీస్ బేరర్లలో కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులను వామపక్ష విద్యార్థి సంఘాల కూటమే గెలుచుకున్నది. అధ్యక్షురాలుగా గీతాకుమారి, ఉపాధ్యక్షురాలుగా సైమన్ జోయాఖాన్, ప్రధాన కార్యదర్శిగా దుగ్గిరాల శ్రీక్రుష్ణ, సంయుక్త కార్యదర్శిగా సుభాంశు సింగ్ ఎన్నికయ్యారు. ప్రతి స్థానానికి 500కి పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. ఏ రౌండ్ లోనూ ఏబీబీపీ పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 35 మంది కౌన్సిలర్లకు 20 మంది లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులే విజయం సాధించగా, మిగతా కౌన్సిలర్లుగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఇలా సామాజిక వాదుల పాత్ర

జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఇలా సామాజిక వాదుల పాత్ర

జేఎన్ యూ, ఢిల్లీ యూనివర్శిటీల్లో కాషాయ వ్యతిరేక విద్యార్థి సంఘాలే గెలుపొందడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వేత్త ప్లస్ సామాజిక కార్యకర్త అయిన ప్రసేన్ జిత్ బోస్ స్పందిస్తూ రెండేళ్లుగా యూనివర్శిటీలోనూ, బయటా కాషాయవాదులు, ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలతో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఎన్ని విభేదాలు ఉన్నా వామపక్ష విద్యార్థి సంఘాలు సంఘటితం కాగలిగాయి. అది బలమైన ప్యానల్‌గా తయారు కాగా, బీజేపీ - ఆరెస్సెస్ బ్రాండ్ రాజకీయాలతో విసిగి వేసారిన విద్యార్థులకు ఆ లెఫ్ట్ కూటమి భరోసాగా కనిపించింది. ఇక తన సహజమైన ఎన్నికల ప్రచారానికి తోడు ఈసారి సంజాయిషీలు చెప్పుకోవడానికే ఏబీవీపీ క్యాంపెయిన్ సరిపోయింది. విద్యార్థి నజీబ్ అహ్మద్ అద్రుశ్యం మొదలు, జేఎన్ యూ అడ్మినిస్ట్రేషన్, ఎన్డీయే ప్రభుత్వ తప్పిదాల వరకు అన్నింటికీ ఏబీవీపీ విద్యార్థులకు జవాబు చెప్పుకోవాల్సి వచ్చిందని ప్రసేన్ జిత్ బోస్ అన్నారు.

ఇక వామపక్ష సంఘాలే కాకుండా సామాజిక వాదులూ ఈ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయగలిగారని జేఎన్ యూ రీసెర్చ్ స్కాలర్ - సామాజిక కార్యకర్త అన్హుల్ త్రివేది అభిప్రాయ పడ్డారు.

సంఘ్ ను సమర్థంగా అడ్డుకుంటున్న లెఫ్ట్ విద్యార్థి సంఘాలు

సంఘ్ ను సమర్థంగా అడ్డుకుంటున్న లెఫ్ట్ విద్యార్థి సంఘాలు

లెఫ్ట్ కాకుండా.. హిందుత్వకు వ్యతిరేకంగా జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో బరిలోకి దిగిన విద్యార్థి సంఘం బాప్సా. బహుజన అంబేద్కర్ పూలే విద్యార్థి సంఘం గణనీయంగా ఓట్లు పొందగలిగింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై నిరసనలు, భీమ్ ఆర్మీ వంటి ఆందోళనలతో బాప్సా మరో చైతన్యవంతమైన ప్రజాస్వామిక విద్యార్థి సంఘంగా ఎదిగింది. వారి వారి పంథాలో లౌకిక విద్యార్థి సంఘాలు.. ఏబీవీపీ వంటి సంఘాలను సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నాయి' అని అన్షుల్ వివరించారు. మొత్తమ్మీద వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోరుమీద దూసుకెళ్తున్న కాషాయ దళానికి క్యాంపస్‌లు అడ్డుగోడలు కడుతున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రభావం వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పైనా ఉంటుందా? అని పరిశీలకులు సందేహిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు మార్చేశారని ఆరోపణ

ఎన్నికల ఫలితాలు మార్చేశారని ఆరోపణ

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) విజయం సాధించింది. అధ్యక్షుడిగా రాకీ తుషీద్ 1590 ఓట్ల మెజారిటీతో, ఉపాధ్యక్షుడిగా కునాల్ షెరావత్ 175 ఓట్ల ఆధిక్యంతో ఏబీవీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. కార్యదర్శి స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి మహామేధ 2624 ఓట్ల ఆధిక్యంతో, సంయుక్త కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో ఉమాశంకర్ 342 ఓట్ల మెజారిటీతో ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థులపై గెలుపొందారు. అయితే సంయుక్తకార్యదర్శి పదవికి కూడా తమ అభ్యర్థే గెలుపొందాడని, అధికార బీజేపీ ఒత్తిడితో ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేశారని ఎన్‌ఎస్‌యూఐ ఆరోపిస్తున్నది. తిరిగి లెక్కింపు జరుపాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ మూడుస్థానాలను కైవసం చేసుకుంది.

విద్యార్థి నేతలతో సోనియా ఇలా

విద్యార్థి నేతలతో సోనియా ఇలా

డీయూఎస్‌యూలో ఎన్‌ఎస్‌యూఐ విజయంతో ఏఐసీసీ కార్యాలయంలోనూ, సోనియా నివాసం వద్ద కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. విజయం సాధించిన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా కలిసి అభినందనలు తెలిపారు.విజయం సాధించిన ఎన్‌ఎస్‌యూఐ ప్యానెల్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Left alliance retained all 4 seats in JNU students' union elections Geeta Kumari won the president's post defeating Nidhi Tripathi of ABVP A total of 31 councillors elected for various posts: Election Officials.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి