చంద్రబాబు వైపే: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన 'సాక్షి'
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా గత రెండు రోజులుగా తీవ్రంగా ధ్వజమెత్తుతోంది. తాజాగా శనివారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింంది.
తన ఆంధ్ర పర్యటనలో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కాస్తా మెతగ్గా వ్యవహరిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీది, జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని అంటున్నారు. అదే సమయంలో వైసిపితో పొత్తు పెట్టుకోలేనని స్పష్టం చేయడం కూడా మరో కారణమని అంటున్నారు.

పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఆరోపణలకు జవాబులు ఇస్తూ సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అవగాహన లేమి.. అధికారపార్టీని రక్షించాలన్న ఆరాటం.. సంబంధం ఉన్నా లేకున్నా వైఎస్సార్‌ను, వైఎస్ జగన్‌ను, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని తప్పు బట్టాలన్న తపన పవన్ కల్యాణ్ మాటల్లో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.

వైఎస్‌ను దోషిగా చూపించే యత్నం..
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పట్టేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్ మానిఫెస్టోలో చేర్చిన చంద్రబాబును ఎందుకు అడగలేదని సాక్షి ప్రశ్నించింది. వైఎస్ హయాంలో రెగ్యులరైజ్ అయిన కార్మికుల సంఖ్యను కూడా ఇచ్చింది. ఈ సమస్య 20 ఏళ్లుగా ఉందని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనిని గురించి ఆయనను ఆడగలేదా అని పవన్ కల్యాణ్ అనడంపై వివరణ ఇచ్చింది.

దానిపై వైసిపి ఎందుకు మాట్లాడదు.
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై పవన్ కల్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రశ్నించడంపై కూడా సాక్షి మీడియా స్పష్టీకరణ ఇచ్చింది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ బహిష్కరించడం సరికాదని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దీనిపై ఎందుకు మాట్లాడరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై వైసిపి అసెంబ్లీలో ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసింది.

జగన్‌పై పవన్ కల్యాణ్ ఇదేమిి..
ముఖ్యమంత్రి అయ్యాక చేస్తానంటూ జగన్ చెప్పే మాటలు విని విసిగిపోయానని, జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా చేయడని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే నేను చేశాను గానీ కేంద్రం ఒప్పుకోలేదంటాడని అన్నారు. సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సాక్షి మీడియా ప్రస్తావించింది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.

పాతిమా కాలేజీ సమస్యపై ఇలా..
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ఫాతిమా కాలేజీ బాధితులు గోడు వెళ్లబోసుకుంటుంటే పవన్ కల్యాణ్ మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారని సాక్షి మీడియా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తమకు మాట ఇచ్చి తప్పిందని బాధితులు స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనేందుకు పవన్ సాహసించకపోవడాన్ని బట్టి ఆయన పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానించారంటూ రాసింది.

చంద్రబాబు వైపే ఉన్నారని...
పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపే ఉన్నారని చెప్పడానికి సాక్షి మీడియా వార్తాకథనం ప్రతి వాక్యంలోనూ ప్రయత్నించింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ వెనకేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నించింది. ఆ రకంగా జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కాలేదనే సంకేతాలు ఇవ్వజూసింది.












Click it and Unblock the Notifications