గంటా టు ఏరాసు: సీటుకు ఒకే అంటే జగన్‌కు జై?

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు క్యూలో ఉన్నారట. అందులో ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు ఉండటం గమనార్హం. కాంగ్రెసు నేతలు జగన్ వైపు వస్తే వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నాయకులకు చుక్కెదురయ్యే అవకాశాలున్నాయి. పార్టీ మారాలని భావిస్తున్న పలువురు జగన్, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు, మరో మంత్రి పినిపె విశ్వరూప్‌లు జగన్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గంటా వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ స్థానం నుండి, విశ్వరూప్ అమలాపురం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం చర్చలు జరుపుతున్నారట.
నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి కూడా జగన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఆయనకు సిట్టింగ్ స్థానం కేటాయింపుపై జగన్ నుండి హామీ లభించినట్లుగా తెలుస్తోంది. సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి పేరును కర్నూలు లోకసభ స్థానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు ఖరారు చేసిందంటున్నారు.
మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నారట. ఆయన నంద్యాల లోకసభ స్థానం కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ దానిపై ఇప్పటికై ఎస్పీవై రెడ్డికి హామీ ఇచ్చామని వారు చెబుతున్నారట. ఏరాసు రెండో ఆప్షన్‌గా కర్నూలు స్థానాన్ని కోరినప్పటికీ దానిని శిల్పా మోహన్ రెడ్డికి ఇచ్చినట్లు చెబుతున్నారంటున్నారు. మరో మంత్రి టిజి వెంకటేష్ చేరికపై సైతం చర్చలు జరుగుతున్నాయట.












Click it and Unblock the Notifications