• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలో సంక్షోభాలు ఇవీ: తమిళనాట క్యాంపు పాలిటిక్స్

By Swetha Basvababu
|

చెన్నై: అధికార అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం రెండు గ్రూపులు ఘర్షణకు దిగడం ఇది రెండోసారి. గమ్మత్తేమిటంటే తొలుత బలహీనంగా ఉన్నట్లు కనిపించిన వారే తర్వాత విజయం సాధించడం. తమిళ పురుచ్ఛితలైవిగా పేరొందిన జయ అనారోగ్య కారణాల రీత్యా గతేడాది డిసెంబర్ ఐదో తేదీన మరణించారు. దీంతో తొలి నుంచి ఆమెకు విశ్వాస పాత్రుడిగా ఉంటూ అప్పటివరకు రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం సీఎంగా ప్రమాణం చేశారు.

జయ నెచ్చెలిగా ఉన్న శశికళ నాటి నుంచి.. కాదు కాదు తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గ్రూపును కొనసాగిస్తూ వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో తన వారికే ఎక్కువ టిక్కెట్లు వచ్చేలా చూసుకున్నారు. అది ఇప్పుడు ఆమెకు కలిసి వస్తున్నది. విననివారిని బెదిరించడానికి దినకరన్ వంటి వారు.. మన్నార్ గుడి మాఫియా ఉండనే ఉంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికయ్యేలా చూసుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో (బలవంతపు) రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం.. రెండు రోజుల తర్వాత ఈ నెల ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో జయ సమాధి వద్ద మౌన దీక్షతో తిరుగుబావుటా ఎగరేయడంతో శశికళ ఉలిక్కిపడ్డారు.

బుధవారం ఆగమేఘాల మీద సమావేశం నిర్వహించి వచ్చిన ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. రాజధాని నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్టులో ఎమ్మెల్యేలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులోనే సుమారు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ తుఫానుకు కేంద్రంగా ఉన్న రిసార్టు నుంచి ఎమ్మెల్యేలు బయటకు వస్తే గానీ సమస్య పరిష్కారం కాదు. దేశంలో ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నిర్వహించడం ఇదేమీ కొత్త కాదు.

ఆ మాటకు వస్తే 1987లో అన్నాడీఎంకే హయాంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ మరణించిన 14 రోజులకు పార్టీ తొలిసారి రెండుగా చీలిపోయింది. ఎంజీఆర్ సతీమణి జానకి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత ఆ గ్రూపులకు నాయకత్వం వహించారు. తొలుత ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న జయలలిత తర్వాత పుంజుకుని పార్టీకి సారథ్యం వహించే స్థాయికి.. రాష్ట్ర, జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఒక్కసారి గతంలో క్యాంపు రాజకీయాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం..

1987లో ఇలా జరిగింది..

1987లో ఇలా జరిగింది..

అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు సీఎంగా ఎంజీఆర్.. ఆసుపత్రిలో ఉన్పప్పుడే 1987 డిసెంబర్ 24న తాత్కాలిక సీఎంగా సీనియర్ నేత నెడుంజెడియన్ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 15 రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. జానకీ రామచంద్రన్, జయలలిత మధ్య ఘర్షణ మొదలు కావడంతో ఇరు పక్షాలు క్యాంపు రాజకీయాలు చేశాయి. జానకీ రామచంద్రన్ గవర్నర్ వద్ద తన మెజారిటీ నిరూపించుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత అసెంబ్లీతో జయ వర్గం ఎమ్మెల్యేలపై దాడి చేసినా నాటి స్పీకర్ (ప్రస్తుతం పన్నీర్ పక్షాన నిలిచిన) పాండ్యన్ నోరు మెదపలేదు. ఈ పరిణామాలు జాతికే కళంకమని భావించి ఒక్క రోజు వ్యవధిలో జానకీ రామచంద్రన్ సర్కార్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జయ, జానకీ గ్రూపుల మధ్య అన్నాడీఎంకే చీలిపోవడంతో కరుణానిధి 1989 జనవరిలో సీఎంగా ఎన్నికయ్యారు. 1991లో నాటి నేషనల్ ఫ్రంట్ చీలిక గ్రూప్ చంద్రశేఖర్ సారథ్యంలోని కేంద్రం కరుణ సర్కార్ ను రద్దు చేయడంతో తొలిసారి జయ 1991 జూన్ 24న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

టీడీపీలో ఇలా జరిగింది...

టీడీపీలో ఇలా జరిగింది...

1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెర దించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ ఏడాది తర్వాత వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. 1984లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్క రోజు ముందు భారత దేశానికి వచ్చేశారు. కానీ ఈ లోగా నాటి ఆర్థిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు.. గవర్నర్ రాంలాల్ సహకారంతో ఎమ్మెల్యేలను తన పక్షానికి మళ్లించేందుకు పూనుకున్నారు. ఈ విషయం బయటపడటంతో టీడీపీ అధినేత ఎన్టీఆర్ ఎమ్మెల్యేలను హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని హోటళ్లలో ఉంచారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాగడం, జాతీయ స్థాయిలో విపక్షాలు తీవ్ర నిరసన తెలియజేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. గవర్నర్ రాంలాల్ ను తొలగించి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్ గా నియమించిన తర్వాత ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

48 గంటల సీఎంగా జగదంబికా పాల్ రికార్డు

48 గంటల సీఎంగా జగదంబికా పాల్ రికార్డు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చిన ఘనత బిజెపిది. నాడు మధ్యంతర లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కలిసి అప్పటి సీఎం కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని సాగనంపి.. జగదంబికా పాల్ అనే సీనియర్ నేతను సీఎంగా నియమించారు. లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జగదంబికా పాల్ ఆకర్షించకుండా బిజెపి, తన మద్దతుదార్లను రహస్య ప్రదేశానికి తరలించింది. మరోవైపు లక్నోలో అప్పటి బిజెపి సీనియర్ నేత వాజ్ పేయి నిరాహార దీక్ష చేపట్టారు. లక్నో హైకోర్టు శాసనసభలో బల నిరూపణకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా రెండు రోజుల తర్వాత జరిగిన బల నిరూపణలో కల్యాణ్ సింగ్ మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. జగదంబికా పాల్ రెండు రజుల సీఎంగా గణతికెక్కారు. ప్రస్తుతం జగదంబికా పాల్ కూడా బిజెపి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు అది వేరే సంగతి.

అర్జున్ ముండా ఇలా..

అర్జున్ ముండా ఇలా..

2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2005లో బీహార్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఒంటెద్దు పోకడలతో లోక్ జనశక్తి అధినేత రాం విలాస్ పాశ్వాన్, ఆర్జేడీ, కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఫలితంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు జార్ఖండ్‌లో ఐదుగురు సభ్యుల మెజారిటీ తక్కువైంది. స్వతంత్ర్య సభ్యులతో సంప్రదింపులు జరిపిన జఎంఎం అధినేత శిబూసోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తమ అధికారాన్ని కాపాడుకునేందుకు బిజెపి క్యాంపు రాజకీయాలకు తెర తీసింది. శిబూ సోరెన్ క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారినీ బలవంతంగా క్యాంపులకు తరలించిన నేపథ్యం కమలనాథులది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్జున్ ముండా తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. కానీ స్వతంత్ర ఎమ్మెల్యే మధుకోడా స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జెఎంఎం మద్దతుతో సీఎంగా ఉన్నారు.

ఎన్టీఆర్‌పై చంద్రబాబు ఇలా..

ఎన్టీఆర్‌పై చంద్రబాబు ఇలా..

మూడోసారి 1994లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్.. చంద్రబాబును ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో సింహభాగం చంద్రబాబు మద్దతుదారులే. 1994కు ముందు అనారోగ్యంగా ఉన్న ఎన్టీఆర్ కు సేవలు చేసినందుకు ఆయన లక్ష్మీ పార్వతిని పెండ్లాడారు. కానీ ఆమెను రాజ్యాంగేతర శక్తి అని ప్రచారంలోకి తెచ్చారు ఆమె వ్యతిరేకులు. అందుకు అనుగుణంగా తెలుగు మీడియాలో ఒక వర్గం వ్యూహాత్మకంగా చంద్రబాబుకే మద్దతు పలికింది. 1995 ఆగస్టులో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్ర క్యాబినెట్ అంతా పర్యటించింది. తిరుగు ప్రయాణంలో చంద్రబాబు తదితరులు ఒకరోజు ముందే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. (అంతకుముందే వ్యూహత్మకంగా తమ వేదికను సిద్ధం చేసుకున్నారు) నగరంలోని ప్రముఖ హోటల్‌ను తమ క్యాంపు రాజకీయాలకు వేదికగా మార్చుకుని ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇది ఇష్టంలేని వారు చూసి రావడానికి వెళ్లి అక్కడే తిష్ట వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తర్వాత పరిణామ క్రమంలో నాటి గవర్నర్ బల పరీక్షకు ఆదేశించడంతో చివరి క్షణంలో సీఎంగా ఎన్టీఆర్ పదవికి రాజీనామా చేయడం.. తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని సంఘటనలు ఇలా.

మరిన్ని సంఘటనలు ఇలా.

2002లో ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ ప్రభుత్వ ఏర్పాటుకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి వచ్చింది. దీంతో బీఎస్పీ అధినేత మాయావతి తన 50 మంది ఎమ్మెల్యేలతో శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత అదే ఏడాది బిజెపితో కలిసి సర్కార్ ఏర్పాటు చేసింది. 2005లో బీహార్‌లో బీజేపీ - జేడీయూ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం లోక్ జనశక్తి తన ఎమ్మెల్యేలతో శిబిరం నడిపింది. 2007లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం గెగాంగ్ అపాంగ్ పై తిరుగుబాటు చేసిన డార్జీ ఖండూ, 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయం నెరిపారు.

English summary
Camp politics is not new in our country. It's started in Anna DMK in 1998 first time. Then Jayalalitha, Janaki Ramachandran played camps but Jaya wins. NTR also maintain camp politics in 1984 crises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X