ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ విషయంలో కొత్త చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 41 మంది కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ్యులు ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పీ) నాయకుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సోనియాకు వినితపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం రాయించి, సోనియాకు సమర్పించజేసింది వైయస్ రాజశేఖర రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు మిగతా పార్టీలు కూడా అంటున్నాయి. తెలంగాణకు అనుకూలంగా అప్పుడు వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. అధికారం కోసం ఆనాడు తెలంగాణ పాట పాడారనే అపవాదు పడింది. దాంతో తనకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. అయితే మాజీ సైనికోద్యోగి అయిన పాండురంగారెడ్డి తాను రాసిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, ఆ వినతిపత్రం గురించి రాజశేఖర రెడ్డికి తెలిసే జరిగిందని అంటున్నారు. అధికారం కోసమే రాజశేఖర రెడ్డి ఆ సమయంలో అలా చేయించారని కూడా ఆయన అంటున్నారు. తాను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిని కానని, రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని కూడా కానని పాండురంగారెడ్డి చెబుతున్నారు. ఆనాటి మాట ఈనాడు తనకు చుట్టుకోవడం వైయస్ కు కష్టమైన విషయమే.