హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నోట సినీ నటుడు బాలకృష్ణ పేరు వచ్చింది. ఉగ్రవాదంపై శాసనసభలో చర్చ సందర్భంగా గురువారం ఆయన బాలయ్య పేరును తెచ్చారు. తాము తెలుగుదేశం పార్టీ మాదిరిగా అన్ని విషయాలను రాజకీయం చేయడం లేదని అంటూ బాలకృష్ణ ఇంట్లో కాల్పులను రాజకీయం చేశామా అని అడిగారు. దీన్ని బట్టి ముందు ముందు తెలుగుదేశం పార్టీ దూకుడును నిలువరించడానికి, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడాన్ని తిప్పికొట్టడానికి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులను ముందుకు తీసుకు వస్తుందనడానికి ఇది సూచిక అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1989లో హైదరాబాదులో కడపకు చెందినవారు మతఘర్షణలకు పాల్పపడ్డారని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చెప్పిన విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా బాలయ్య ఇంట్లో కాల్పుల విషయాన్ని ముందుకు తెచ్చారు. ఏమైనా, ఈ కాల్పుల సంఘటన బాలకృష్ణ రాజకీయ కార్యకలాపాలకు ఏ మేరకు అడ్డుపడుతుందో వేచి చూడాల్సిందే.