సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయప్రద ఆసరాగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో నాలుగో కూటమిపై ఆయన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జనశక్తి నేత రాం విలాస్ పాశ్వాన్ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఇది యుపిఎలోనే మరో యుపిఎనా, నాలుగో కూటమియా తెలియడం లేదు. బహుశా చిరంజీవి తలపోస్తున్న కూటమి ఇదే అయి ఉంటుంది. ఈ కూటమిలో ప్రధాన పాత్ర పోషించేందుకు చిరంజీవి సిద్ధం కావడం వెనక జయప్రద పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ జయప్రదను, జయా బచ్చన్ ను వెంట పెట్టుకుని హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలుసుకుని మంతనాలు జరిపిన విషయం తెలియంది కాదు. చిరంజీవి కోసం తాము రాష్ట్రంలో ప్రచారం చేస్తామని కూడా అమర్ సింగ్ అప్పట్లో చెప్పారు. ఇప్పటి చిరంజీవి యత్నాలకు అప్పుడే పునాది పడిందని చెప్పవచ్చునేమో. కాగా, తమ పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ ను లోకసభకు పోటీ చేయించడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. దేవేందర్ గౌడ్ శాసనసభకే కాకుండా మల్కాజిగిరి నుంచి లోకసభకు కూడా పోటీ పడుతున్నారు. దీన్ని బట్టి చిరంజీవికి దూరదృష్టి ఉందని చెప్పవచ్చు.