కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూచన వంటి హెచ్చరిక చేశారు. పార్టీని చీల్చే శక్తి జగన్ కు లేదని కూడా ఆయన నర్మగర్భంగా చెప్పారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాష్ట్ర కాంగ్రెసులో తిరుగుబాటు తలెత్తుతుందనే ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. వైయస్ ముఖ్యమంత్రి కావడానికి దశాబ్దాల కాలం పట్డిందని, పార్టీ అధిష్ఠాన వర్గం అండదండల వల్లనే వైయస్ ముఖ్యమంత్రి ఆయ్యారని ఆయన ఇంతకు ముందు ఒక్కసారి అన్నారు. రెండు సార్లు పార్టీ అధిష్ఠాన వర్గం అవకాశం ఇచ్చినా వైయస్ విఫలమయ్యారని, చివరకు 2004లో విజయం సాధించారని ఆయన చెబుతూ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే తండ్రి బాట పట్టాలని ఆయన సూచించారు. జగన్ పార్టీని చీల్చలేరని కూడా ఈసారి కొంచెం కచ్చితంగానే చెప్పారు. పార్టీ హైకమాండ్ ను ధిక్కరించిన మర్రి చెన్నారెడ్డి, కరుణాకరన్, శరద్ పవార్, మమతా బెనర్జీ ఏమయ్యారో చూడాలని ఆయన అన్యాపదేశంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడమే కాంగ్రెసు ప్రథమ కర్తవ్యమని, అధిష్ఠాన వర్గం ఈ దిశలోనే ఆలోచిస్తోందని ఆయన అన్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ వ్యతిరేక గ్రూపులో వి హనుమంతరావు వంటి పలువురు తెలంగాణ సీనియర్ నాయకులున్నారు. వీరిని ఒప్పించడం అంత సులభమేమీ కాదు. అదే సమయంలో వీరి మాటను పార్టీ అధిష్ఠాన వర్గం తోసిపుచ్చలేదు కూడా. అందువల్ల జగన్ ఈసారి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకోక తప్పదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.