మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర నాయకత్వం గాలం వేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆయన చరిష్మాను వాడుకుని కేంద్రంలో యుపిఎ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేయాలని బిజెపి ఎత్తుగడగా చెబుతున్నారు. శత్రువు శత్రువు మిత్రుడన్నట్లుగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని దెబ్బ తీయడమే లక్ష్యంగా జగన్ ను దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడే కాకుండా వైయస్ జగన్ వ్యాపార భాగస్వామి కూడా. దీంతో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా వైయస్ జగన్ ను దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ, యుపిఎ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీలు కాకపోతే, వచ్చే ఎన్నికల నాటికి వైయస్ జగన్ తో పొత్తును ఖరారు చేసుకోవాలని ఆరాటపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ అందుకు సిద్ధపడుతారా అనేది అనుమానమే. బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనార్టీల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని వైయస్ జగన్ భావించే అవకాశం ఉంది. అయితే, ఎన్నికల తర్వాత అవసరమైతే కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించవచ్చు. ఏమైనా, వైయస్ జగన్ వల్ల రాష్ట్ర రాజకీయాలే కాదు, కేంద్ర రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి.