తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తిరుగులేని ఆయుధాన్ని ప్రయోగించింది. తెలంగాణ విషయంలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు కాంగ్రెసు పార్టీని ఇంత కాలం తప్పు పడుతూ వచ్చారు. దాంతో కాస్తో కూస్తో తెలుగుదేశం పార్టీకి తెలంగాణపై మాట్లాడేందుకు గొంతు విప్పవడానికి అవకాశం ఉంటూ వచ్చింది. ఆ కొద్ది అవకాశాన్ని కూడా కాంగ్రెసు పార్టీ మూసేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలనే డిమాండుతో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిరవధిక నిరాహార దీక్ష చేయడం ద్వారా చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. అవసరమైతే తాము ఎంతకైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రజలకు సంకేతాలు ఇచ్చినట్లయింది. తాము అధిష్టానాన్ని కూడా ధిక్కరించగలమని చెబుతూ చంద్రబాబును తెలుగుదేశం తెలంగాణ నాయకులు ధిక్కరించగలరా అనే సవాల్ విసిరినట్లయింది. ఏమైనా, తెలుగుదేశం తెలంగాణ నాయకులు మరింత తీవ్రంగా తెలంగాణ కోసం ముందుకు రావాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఇది చంద్రబాబు తీవ్రంగా ఇరకాటంలో పడినట్లయింది.