రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో రెడ్లకు, కమ్మలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉందని, తమ పాత్రలను పెట్టలేదని బిసీలు, ఎస్సీలు వర్మపై మండిపడుతున్నారు. రెడ్లు, కమ్మ నాయకుల ఫాక్షనిజానికి బలైంది తామేనని వారంటున్నారు. ఫాక్షనిజంలో చంపింది, చచ్చిపోయింది దళితులేనని వారంటున్నారు. తమను కమ్మ, రెడ్డి నాయకులు వాడుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రక్త చరిత్రపై రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్లను దుర్మార్గులుగా, విలన్లుగా సినిమాలో చూపించారని, కమ్మలను ఉత్తములుగా చూపించారని రెడ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కారెడ్డి పాత్రను దుష్టుడిగా చూపించడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై ఒసి సంక్షేమ సంఘం రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెడ్లలో చాలా మంది ఫాక్షనిస్టులనే అభిప్రాయం సినిమా వల్ల కలుగుతుందని సంఘం అధ్యక్షుడు కరుణాకర రెడ్డి అన్నారు. కమ్మలు, రెడ్లు కలిసిపోతున్న సమయంలో మళ్లీ పాత కక్షలను సినిమా రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. సినిమాపై నిషేధం విధించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.