కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రస్తుత స్థితిని చూస్తుంటే శేఖర్ కమ్ముల సృష్టించిన లీడర్ చిత్రం గుర్తొస్తోంది. ఇప్పుడు చాలా మంది శేఖర్ కమ్ముల సినిమాను తలుచుకుంటున్నారు. లీడర్ చిత్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి రామచందర్ రావు, వైయస్ జగన్ లను పోలిన పాత్రలున్నాయి. ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఆకస్మాత్తుగా మృతిచెందితే ఆయన కుటుంబంలోనూ, రాష్ట్రంలోనూ ఏర్పడే విపరీత పరిణామాలను లీడర్ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్ర నిర్మాణాన్ని శేఖర్ కమ్ముల రెండేళ్ల క్రితం మొదలు పెట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించేనాటికి ఈ సినిమా నిర్మాణం పూర్తయింది. ఇందులోని అర్జున్ ప్రసాద్ పాత్ర జగన్ ను పోలి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి కోసం అతను పడే తపన, అతను ఎదుర్కున్న అవమానాలను శేఖర్ ఈ చిత్రంలో చూపించారు. సమకాలీన పరిణామాలను బట్టి భవిష్యత్తును ఊహించడం, సమకాలీన పరిస్థితులు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో ఊహించడం కళాకారుడిగా శేఖర్ చేశారని చెప్పవచ్చు. అయితే ముగింపులో అర్జున్ ప్రసాద్ ను ప్రజా నాయకుడిగా మారిననట్లు చూపారు. అందుకు తీసుకున్న చర్యలను కూడా చూపించారు. ఆస్తులను శాశ్వత నిధికి జమ చేయడం, ప్రజలకు సేవ చేయడం అనేది శేఖర్ కమ్ముల చూపిన మార్గం. కానీ అది జగన్ లాంటి నాయకుడు చేసే పనేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కళాకారుడిగా శేఖర్ కమ్ముల కేవలం ఆశావహ దృక్పథంతో మంచి ముగింపు ఇచ్చాడని సంతృప్తి చెందాల్సిందే.