నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్రకు సంబంధించి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కొండను ఢీకొడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు కావడంతో ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర ఏటికి ఎదురీదడం లాగానే ఉంటుందని భావిస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి క్షణం పడేది కాదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి పెద్ద యెత్తున అసమ్మతి రాజకీయాలు నడిపారు. ఆయనకు కంటిలో నలుసులా తయారయ్యారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనను వదలలేదు. కేంద్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా చేశారని అంటారు. అలాగే, ఎన్నికల్లో టికెట్ లభించకుండా కూడా వైయస్ చూశారని ప్రచారంలో ఉంది. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి వర్గాన్ని అణచేసి తన వర్గాన్ని వైయస్ పెంచి పోషించారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మిని వైయస్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రెండోసారి ఆమెకు ఆ అవకాశం కూడా రాలేదు. ఆమె శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. రాజ్యలక్ష్మి ఓటమికి వైయస్ ఓ చేయి వేశారని నేదురుమల్లి ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతారు. ఈ స్థితిలో నేదురుమల్లి జగన్ ఓదార్పు యాత్రకు గండి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారని అంటున్నారు. తిరిగి తన ప్రాబల్యాన్ని సాధించుకోవడానికే కాకుండా వైయస్ పై తన ప్రతీకారాన్ని జగన్ మీద తీర్చుకునేందుకు ఆయనకు అవకాశం చిక్కిందని అంటున్నారు. నెల్లూరులో విగ్రహ స్థాపనకు ఏర్పడుతున్న అడ్డంకులను ఇందులో భాగంగానే చూడాలని అనేవారు కూడా లేకపోలేదు.