తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కత్తి కట్టారనే భావిస్తున్నారు. జగన్ ను ఎట్టి పరిస్థితిలోనూ సహించే ప్రసక్తి లేదని ఆయన పట్టుబట్టి కూర్చున్నారట. అంతేకాకుండా, వైయస్ జగన్ ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కూడా ఆయన పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు చేసిన ప్రకటన కూడా అందుకు సాక్ష్యం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెసు కమిటీని రద్దు చేయడంపై అంబటి రాంబాబు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. యువజన కాంగ్రెసు, ఎన్ఎస్ యుఐ వ్యవహారాలను రాహుల్ గాంధీ చూస్తున్నారు. వైయస్ జగన్ ను దెబ్బ తీయడానికే రాహుల్ గాంధీ రాష్ట్ర యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేసినట్లు భావిస్తున్నారు. అదే విషయాన్ని మరో రూపంలో అంబటి రాంబాబు చెప్పారు. యుజన కాంగ్రెసు కమిటీ నాయకులు జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నారని, జగన్ కు సహకారం అందిస్తున్నారని యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేశారని ఆయన విమర్శించారు. దాని వల్ల పార్టీ నిర్వీర్యం అవుతుందని ఆయన అన్నారు.