రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిజంగానే మంటగా ఉన్నారట. ముఖ్యమంత్రి పదవి తనకు అందకుండా చేసింది కెవిపి రామచందర్ రావే అని ఆయన మనసులో పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతదేహం ఉండగానే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాల సేకరణ జరిపించి, తనను బద్నాం చేశారని ఆయన భావిస్తున్నారట. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి తనపై చెడు అభిప్రాయం కలిగేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రఘువీరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ మంత్రులు కూడా వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ఆ సమయంలో కెవిపి గట్టిగా అధిష్టానం వద్ద మాట్లాడి ఉంటే తాను ముఖ్యమంత్రిని అయి ఉండేవాడినని జగన్ భావిస్తున్నారని సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాల్లో వైయస్ జగన్, కెవిపి పరస్పరం పోటీ పడ్డారని, ఈ వైరమే జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకుండా కెవిపి అడ్డుపడ్డారని అంటున్నారు. ఏమైనా, కొండా సురేఖ కెవిపికి రాసిన లేఖ వైయస్ జగన్ ఆగ్రహానికి దీటుగానే వచ్చిందని చెబుతున్నారు.