పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని ఆసరా చేసుకుని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను కాంగ్రెసు హైకమాండ్ దెబ్బ తీసింది. వైయస్ జగన్ భయానికి సిఎల్పీ సమావేశం నిర్వహించడానికి కూడా భయపడే పరిస్థితి నుంచి సిఎల్పీ సమావేశం పెట్టడమే కాకుండా కొత్త నేతను ఎంపిక చేసే వ్యవహారాన్ని ఏ మాత్రం గొడవ లేకుండా చేసుకునే స్థితికి హైకమాండ్ చేరుకుంది. ఇందుకు హైకమాండ్ కు సాక్షి కథనమే బాగా పనికి వచ్చిందని అంటున్నారు. సాక్షి కథనానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెసు నాయకులంతా ఏకమై విమర్శలు చేసే స్థితిని హైకమాండ్ కావాలనే సృష్టించిందని అంటున్నారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం రాయడం, వైయస్ జగన్ వర్గం దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం అధిష్టానానికి బాగా కలిసి వచ్చింది. ఆ వేడిలో నాయకత్వ మార్పును సజావుగా నెరవేర్చగలిగింది. ముఖ్యమంత్రిగా ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక వైయస్ జగన్ కు షాక్ వంటిదే. వైయస్ హయాంలో కిరణ్ కుమార్ కు మంత్రి పదవి రాకుండా వైయస్ జగన్ అడ్డుకున్నారని, దానివల్ల వైయస్ జగన్ పై కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని అంటారు.