చాలా కాలం తర్వాత మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు గంగా భవాని తెర ముందుకు వచ్చారు. రావడం కూడా తన వెంట పెద్ద దుమారంతో వచ్చారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన రోజాపై గంగవెర్రులెత్తారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన రోజాపై ఆమె తన మాటల తూటాలను వదిలారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా తిట్టిన తిట్లను ఆమె గుర్తు చేశారు. వైయస్ ముద్దులిస్తానంటే మీరు గుద్దులివ్వండని రోజా అప్పట్లో చేసిన వ్యాఖ్యను గుర్తు తెచ్చారు. వైయస్ జగన్‌ను రోజా సైతాన్‌లా పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ చేరిన దుష్టచతుయాన్ని ఆమె ముందుకు తెచ్చారు. అంబటి రాంబాబు, రోజా, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖలను ఆమె దుష్టచతుష్టయంగా పిలిచారు. ఎప్పటి మాదిరిగా తన పంచ్ డైలాగులతో గంగా భవాని అదరగొట్టారు.