ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల బాధ్యతను తీసుకోవడానికి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ భయపడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని తప్పించి, గులాం నబీ ఆజాద్‌ను వేయాలనేది కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిమతమని చెబుతున్నారు. ఆజాద్‌కు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పట్ల పూర్తి అవగాహన ఉండడం, సమస్యలను పరిష్కరించడంలో దిట్ట కావడం వల్ల ప్రస్తుత స్థితి నుంచి పార్టీని గట్టెక్కించడానికి ఆజాద్ అయితేనే సరిపోతారని ఆమె అనుకుంటున్నట్లు సమాచారం. 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో ఆజాద్‌ది ముఖ్యమైన పాత్ర. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని సిఎల్పీ నేతగా ఎంపిక చేసే సమయంలో కూడా ఆజాద్‌ను ప్రత్యేకంగా రాష్ట్రానికి పంపించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యతను తీసుకోవడానికి ఆజాద్ ఇష్టపడడం లేదని అంటున్నారు. వైయస్ జగన్ వ్యవహారం, తెలంగాణ అంశం కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. వీటిని తన తలకు చుట్టుకోవడానికి ఆజాద్ సిద్ధంగా లేరని అంటున్నారు. ఆజాద్ మాత్రమే కాదు, అధిష్టానంలోని పెద్దలంతా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలంటే తల పట్టుకుంటున్నారట.