శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గెలిచారా అనే చర్చ జరుగుతోంది. కర్ర విరగకుండా పాము చావకుండా శ్రీకృష్ణ కమిటీ నివేదిక రావడం వల్ల అది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అభివృద్ధి, ఇతర విషయాల్లో లగడపాటి రాజగోపాల్ వాదనలకే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఓటేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సలిజం పెరుగుతుందని, మతతత్వం పెచ్చరిల్లుతుందని లగడపాటి రాజగోపాల్ మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. అవే విషయాలను శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అంతేకాకుండా, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి రంగాలు, హైదరాబాద్ అభివృద్ధి వంటి విషయాల్లో కూడా లగడపాటి రాజగోపాల్ చేస్తున్న వాదనలకే కమిటీ బలం చేకూర్చింది. తెలంగాణవాదులు చేస్తున్న లోతైన విశ్లేషణలకు కమిటీ నివేదికలో ఎక్కడా స్థానం లభించలేదు. అయితే, తెలంగాణ ప్రజల మనోభావాలను మాత్రం పసిగట్టింది. తెలంగాణ కోసం చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణలు కల్పించాలని, అది 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో జరగాలని సూచించింది. అయితే, దీన్ని కూడా లగడపాటి వంటి సీమాంధ్ర నాయకులు ఓడించే అవకాశాలున్నాయి. దీనివల్లనే రాజగోపాల్ కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించారని అంటున్నారు.