శాసనసభ్యుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో అన్ని వైపుల నుంచీ ఆదరణ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన కాంగ్రెసులో అందరివాడిలా మారే అవకాశాలున్నాయి. సోమవారం శాసనసభలో ఆయన చివరి బెంచీలో కూర్చున్నారు. తనకు ముందు బెంచీపై మక్కువ అనే ఊహాగానాలు చెలరేగుతుండడంతో దాన్ని తొలగింపజేసుకునేందుకు ఆయన వెనక బెంచీకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే ఆయనపై మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మరో మంత్రి కన్నా లక్ష్మినారాయణ అవ్యాజమైన ప్రేమను కురిపించారు.
వెనక బెంచీలో కూర్చున్న చిరంజీవి వద్దకు వెళ్లి వారిద్దరు ముందు వరుసలోకి తీసుకుని వచ్చారు. చిరంజీవిని తమ ఇద్దరి మధ్య కూర్చో బెట్టుకుని తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు. చిరంజీవికి కాంగ్రెసులో తగిన గౌరవం, ప్రేమ ఉంటుందని వారు చెప్పకనే చెప్పారు. ఏమైనా, కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం వల్ల టెన్షన్ తగ్గడంతో పాటు చిరంజీవికి అభిమానం కూడా పెరిగినట్లు అనిపిస్తోంది.