సిబిఐ కేసు: జగన్ పార్టీ వైఖరి మారుతోందా

మూడు నెలల క్రితం రాష్ట్రపతి ఎన్నికలు జరిగే సమయం వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జగన్ అరెస్టు కాంగ్రెసు, టిడిపి కుట్ర అని ఆరోపించింది. స్వయానా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా ఓదార్పు సమయంలో తన ఆస్తులపై సిబిఐ కేసుకు ఢిల్లీ నేతల కుట్ర అని చెప్పారు. అతను పలు సందర్భాలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెసు నేతలతో కుమ్మక్కై తనపై కక్ష కట్టారని మండిపడ్డారు.
జూలైలో రాష్ట్రపతి ఎన్నికల సమయానికి జగన్ పార్టీ స్వరంలో మార్పు కనిపించింది. అప్పటి వరకు కేంద్రమంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుచుకున్నారు. ప్రణబ్‌కు జగన్ పార్టీ ఓటు వేసింది. ఓటు వేయడానికి ముందు ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ... జగన్ పైన కేసుకు, కాంగ్రెసు పార్టీకి సంబంధం లేదని, తమ అధ్యక్షుడి పైన కేసును సిబిఐ మోపిందని చెప్పారు.
వారు అలా చెప్పడంతో జగన్‌ను కేసుల నుండి తప్పించేందుకు కాంగ్రెసు పెద్దలు హామీ ఇవ్వడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికిందనే విమర్శలు వచ్చాయి. త్వరలో ఆ పార్టీ కాంగ్రెసులో విలీనం కావడం ఖాయమని తెలుగుదేశం తదితర పార్టీలు ఆరోపించాయి కూడా. ఆ తర్వాత మళ్లీ జగన్ పార్టీ తమ అధినేతపై సిబిఐ కేసు కాంగ్రెసు, టిడిపి కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నాయి.
దీనిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితం స్పందించారు. జగన్ కేసుకు కాంగ్రెసుకు సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీలే గతంలో చెప్పారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెసు కుట్ర అంటున్నారని, కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ పరిశీలించుకోవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications