పార్టీ మారుతున్నారా?: కిరణ్ ఆరా తీస్తున్నారు
హైదరాబాద్: విభజనపై కాంగ్రెసు పార్టీ దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు సీమాంధ్ర నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరా తీశారాట. బుధవారం సచివాలయంలో కిరణ్‌తో పలువురు మంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పలు అంశాలపై కలిశారు.
ఈ సమయంలో ఆయన పలు అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో ఇతర పార్టీల్లోకి వెళ్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పైన పలువురిని అడిగారు. కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోందని వారితో కిరణ్ చెప్పగా... పలువురు అది నిజమేనని చెప్పగా, ఇంకొందరు కాదని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజాప్రతినిధులను చూస్తూ శాసన సభ కోరం అంతా ఇక్కడే ఉన్నట్లుందే అని కిరణ్ సరదాగా వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ విభజనపై దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి విశ్వరూప్, ఎంపి ఎస్పీవై రెడ్డి తదితరులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
మరికొందరు క్యూలో ఉన్నారంటున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు కూడా పలువురు నేతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ పార్టీ మారే అంశంపై సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం గమనార్హం. కొందరు ఎవరూ వెళ్లరని చెప్పినప్పటికీ చాలామంది ఆ పరిస్థితే ఉందని కిరణ్‌కు తేల్చి చెప్పారట.












Click it and Unblock the Notifications