జూన్ నుంచి నారా లోకేష్ దరువేస్తారట..

తాను చెప్పాల్సిన విషయాలపై ట్విట్టర్‌లో మాట్లాడడం ఆయనకు తెగ నచ్చేసిన లేదా వచ్చేసిన విద్య. ఆయన కామెంట్స్ ట్విట్టర్‌లో పరుగులు తీస్తుంటాయి. అటువంటి నారా లోకేష్ జూన్ నుంచి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. అంటే, ట్విట్టర్‌ను పక్కన పెట్టేసి ప్రజల్లోకి వెళ్తారన్న మాట.
తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశానికి తండ్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలోనే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. జూన్‌లో లోకేష్ సతీమణి బ్రాహ్మణి విద్యాభ్యాసం ముగించుకుని స్వదేశానికి వస్తున్నారు. ఆమెకు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించి తాను పూర్తిస్థాయి రాజకీయనేత అవతారమెత్తాలని లోకేష్ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు చేయనున్న కార్యక్రమాలపై చంద్రబాబు 'యువత డిక్లరేషన్'ను ప్రకటించనున్నారు. ఈ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను లోకేష్‌కు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించి, ఆయనతో ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని చూస్తున్నారట. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో వెలుగుతారో వేచి చూడాలి. తండ్రి చాటు బిడ్డ స్థాయి నుంచి ఆయన బయట పడుతారన్న మాట.












Click it and Unblock the Notifications