విశాఖ లోకసభ సీటు: బాలకృష్ణతో షర్మిల ఢీ?
విశాఖపట్నం: ప్రస్తుతం కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం లోకసభ స్థానంలో వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురంధేశ్వరికి టికెట్ దగ్గకుండా తాను పోటీ చేయడానికి కాంగ్రెసు నేత టి. సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థితిలో పురంధేశ్వరి విజయవాడ లోకసభ స్థానానికి మారే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో సుబ్బిరామిరెడ్డికి పిడుగులాంటి సమాచారం వస్తోంది.
విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి నుంచి వైయస్ షర్మిల, తెలుగదేశం పార్టీ నుంచి సినీ హీరో బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. జగన్ జైలులో వుండగా ఆయన సోదరి షర్మిల నిర్వహించిన పాదయాత్ర విశాఖలో కొనసాగింది. భారీ బహిరంగ సభలో కూడ ప్రసంగించారు. అప్పుడే ఇక్కడ వున్న కొంత మంది వైకాపా నేతలు ఆమెను విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని సూచించారు.

ఆమె ఇక్కడ నుండి పోటీ చేస్తే దీని ప్రభావం ఉత్తరాంధ్రపై వుంటుందని మూడు జిల్లాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. షర్మిల పోటీకి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశాఖ నుంచి బాలకృష్ణ పోటీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
వైయస్ షర్మిల, బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి పోటీలో ఉంటే కాంగ్రెసు తరఫున పోటీకి దిగే టి. సుబ్బిరామిరెడ్డికి కష్టమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications