ఆ రోజు లక్షమంది హిందుత్వలోకి: లేఖ కలకలం, సాధ్యంకాదని విహెచ్
లక్నో/న్యూఢిల్లీ: ఆగ్రాలో మత మార్పిడుల కార్యక్రమానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి కిశోర్ వాల్మీకి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు, అలీగఢ్‌లో మరో మార్పిడి కార్యక్రమానికి సన్నద్ధత వెలుగు చూసింది. మతం మారిన వారిని హిందూ మతంలోకి తీసుకు రావాలంటూ, అందుకు నిధులు సేకరించాలని రాజేశ్వర్ సింగ్ అనే వ్యక్తి పేరిట లేఖ ఒకటి వెలుగు చూసింది.
ఈ లేఖలో ఆయన మతమార్పిడులకు అయ్యే ఖర్చును పేర్కొని, దానిని ప్రజలు సమకూర్చాల్సిందిగా కోరారు. పునః మతమార్పిడి కార్యక్రమాలు 50 వరకూ నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో లక్ష మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ నెల 25న అలీగఢ్‌లో పెద్ద సంఖ్యలో పునః మతమార్పిడుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజేశ్వర్ సింగ్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న హిందూ జాగరణ మంచ్ ప్రకటించింది.
గతంలో హిందూమతాన్ని వదిలివేసి వేరే మతంలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి స్వచ్ఛందంగా హిందూమతం తీసుకోబోతున్నారని ఆయన వెల్లడించారు. ఇది సొంతింటికి రావడమని, మత మార్పిడి కాదన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనను అలీగఢ్ ఎంపీ సతీశ్ గౌతమ్ సమర్థించారు.

జనం స్వచ్ఛందంగా, శాంతియుతంగా హిందూమతంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, అలా చేసే హక్కు వారికి పూర్తిగా ఉందని గౌతమ్ అన్నారు. ఇదిలా ఉండగా రాజేశ్వర్ సింగ్ ప్రకటనపై స్థానిక బీజేపీయేతర పార్టీల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది మత మార్పిడికి సంబంధించిన ప్రశ్న కాదని, రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని మతాల వారీగా చీల్చడానికి ఉద్దేశపూర్వకంగా జరుపుతున్న కుట్ర అని ఆరెల్డీ ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ అన్నారు. శాంతికాముకులైన నగర ప్రజలంతా బీజేపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
హిందూ దేశంగా ఎన్నటికీ మార్చలేరు: విహెచ్
లౌకిక దేశమైన భారత్‌ను ఎన్డీయే ప్రభుత్వం హిందూ దేశంగా ఎన్నటికీ మార్చలేదని కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు. అలాంటి యోచన తగదన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడలేరు. ఏదో ఒక ప్రకటన చేసి పార్లమెంటు నడవకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
పేద ముస్లీంలకు ఇళ్లు, సొమ్ములు ఆశ చూపి హిందూమతంలోకి తీసుకు వచ్చేలా చేయడం తగదన్నారు. అన్ని మతాల వారు ఓట్లు వేస్తేనే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందన్నారు. హిందూ దేశంగా మార్చాలని చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రానికి డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా ఉందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications