మోడీని కలిశాకే 'జగన్' కలవరం, బాబు ప్రతీకారం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ఆ పార్టీ నాయకుల్లో కలవరం కలిగించిందా? అంటే అవుననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో బిజెపి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో సీమాంధ్రలో జగన్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది.
ఫలితాల అనంతరం జగన్ వెళ్లి మోడీని కలిశారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మోడీని జగన్ కలిసింది కేసుల మాఫీ కోసమేనని కానీ బిజెపి షాక్ ఇచ్చిందని టిడిపి చెబుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సంవత్సరానికి పైగా జైల్లో గడిపారు.

మరోవైపు రాజకీయ నాయకుల పైన ఉన్న అవినీతి కేసులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరోవైపు కేంద్రంలో టిడిపి మిత్ర పక్షం బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలు వేసుకొని.. కేసుల మాఫీ కోసే ముందస్తుగా మోడీని జగన్ కలిశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నారు.
మోడీ అవినీతిపరులకు తన కేబినెట్లో చోటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే అవినీతి పైన ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. బిజెపికి అంశాల వారీగా మద్దతిస్తామని జగన్ ప్రకటించడం వెనుక కేసుల మాఫీ కోసమేననే వాదనలు అప్పుడే వినిపించాయి.
రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో బిజెపి ఉన్నందున జగన్ కేసు ఎప్పుడేమవుతుందో, ఆయన జైలుకు వెళ్తారేమో, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నేతల్లో ఉందంటున్నారు. చంద్రబాబు కూడా జగన్ పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. అప్పుడే జగన్ నాడు ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications