కొండ పైన లగడపాటి వాగ్వాదం, నడిచి వెళ్లారు
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా కనకదుర్గమ్మను సందర్శించుకోవడానికి లగడపాటి రాజగోపాల్ కుటుంబసమేతంగా ఇందకీలాద్రికి ఉదయం వచ్చారు.
అయితే, ఆయన వాహనాన్ని పోలీసులు కొండ పైకి అనుమతించలేదు. దీంతో, పోలీసులు, దేవస్థానం అధికారులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వారితో వాగ్వాదానికి దిగారు. పాసులు ఉన్న వాహనాలనే పైకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో.. లగడపాటి అమ్మ వారిని దర్శించుకోవడానికి నడుచుకుంటూ కొండ పైకి వెళ్లారు.

కాగా, లగడపాటి రాజగోపాల్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయవాడ నుండి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి సమైక్యవాదం బలంగా వినిపించారు. పార్లమెంటులో బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించారు. విభజన జరిగితే రాజకీయాల నుండి వైదొలగుతానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.












Click it and Unblock the Notifications