గుండెలపై: చిరు అసహనం, ఇదీ వాస్తవమని పవన్‌పై
తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం, బిజెపికి మద్దతివ్వడంపై మీడియా పదే పదే ప్రశ్నించడంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అసహనానికి గురయ్యారు. మీడియాతో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. విశాఖలో తాను పాల్గొన్న సభలో జనం లేరంటూ. ఖాళీ కూర్చీలను పదేపదే మీడియా చూపిస్తోందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభకు ముందు, ఆఖరులో కావాలనే ఖాళీ కుర్చీలను చూపిస్తున్నారని చిరు అన్నారు. అంతా గుండెలపై పొడుస్తున్నారని, మీడియా కూడా ఒక పోటు పొడవాలని చూస్తే తమ పరిస్థితి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. చిన్న విషయాలనే మీడియా పెద్దవిగా చూపుతోందన్నారు. కుటుంబపరంగా పవన్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.

మరోవైపు, కుటుంబ కలహాలు, ప్రజారాజ్యం విలీనం చేయడం లాంటి పరిణామాలతోనే పవన్ దూరమై జనసేన పార్టీ పెట్టారా అని మీడియా ప్రశ్నించగా.. తాను పిఆర్పి పెట్టినప్పుడు యువరాజ్యం తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, తర్వాత తన నటనను కొనసాగిస్తానని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. పిఆర్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తనతో ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. తామంతా కలిసే ఉంటామని, కలహాలు చోటు చేసుకుంటున్నాయనడం అవాస్తవమని చెప్పారు.
ఒకే కుటుంబంలో అందరి ఆలోచనలు, భావాలు ఒకేలా ఉండాలని ఎక్కడా లేదని చిరంజీవి చెప్పారు. పవన్ ఒక భావజాలంతో ముందుకు వచ్చారు. అందుకు తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. తమ మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. పవన్ తన కొడుకులాంటి వాడని చిరంజీవి చెప్పారు. సామాజిక న్యాయం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో పిఆర్పిని విలీనం చేసినట్లు చిరంజీవి తెలిపారు.












Click it and Unblock the Notifications