వాస్తు దోషం: రూట్ మార్చిన కెసిఆర్, 26లోగా..
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే వాహనదారి మారనుంది. సమతా బ్లాక్‌కు ప్రస్తుతం నల్లపోచమ్మ గుడికి ఎడమ వైపు నుండి వాహనాల దారి ఉంది. పోచమ్మ గుడికి ముందు మార్గం నుండి గానీ, వెనుక వైపు నుంచి గానీ వెళ్లడం శ్రేయస్కరం కాదని, గుడని దాటుకొని వెళ్లాలని వాస్తు పండితులు సూచించారు. దీంతో ప్రస్తుతం ఉన్న దానిని మార్చాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
గుడికి కుడివైపు నుంచి మార్గం ఏర్పాటు చేయాలని సిఎం కార్యాలయం సచివాలయ అధికారులను ఆదేశించింది. ఈ మార్గాన్ని గురువారం వారు పరిశీలించారు. కాన్వాయ్ రూట్ ను ఇంటెలిజెన్స్, పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో ఈ మార్గ నిర్మాణం జరగనుంది. పోచమ్మ గుడికి కుడివైపు నుండి ఎ, బి బ్లాక్లు మీదుగా వాహనాలు సిఎం కార్యాలయానికి చేరుతాయి.

26లోగా క్యాంపు కార్యాలయానికి కెసిఆర్
కెసిఆర్ ఈ నెల 26వ తేదీలోపు బేగంపేటలోని అధికారిక నివాసానికి మారనున్నారు. ప్రస్తుతం నందినగర్‌లోని తన సొంత ఇంట్లో కెసిఆర్ ఉంటున్నారు. అక్కడ నివాసం ఇరుకుగా ఉండటంతో సమావేశాలు, చర్చలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మొదట బేగంపేట కార్యాలయానికి మారానుకున్నా వాస్తుదోషం ఉందని చెప్పడంతో కొన్నాళ్లి ఆగారు. ఈ నేపథ్యంలో కుందన్ బాగ్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌కు మారాలని యోచించారు.
వెళ్లేందుకు కెసిఆర్ పూజలు నిర్వహించారు. అయితే అక్కడ పూర్తిగా అనుకూలంగా లేకపోవడంతో ఆగిపోయారు. బేగంపేటలోని సిఎం క్యాంపు కార్యాలయంలో వాస్తుమార్పులు చేయాలని సూచించారు. వాస్తు ప్రకారం లేని గదులను ఉపయోగించకూడదని నిర్ణయించారు. అన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కెసిఆర్ ఈ నెల 26వ తేదీలోపు బేగంపేట క్యాంపు ఆఫీసుకు వెళ్లే అవకాశముంది.
26వ తేదీ నుండి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆయన ఆలోగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ జ్యేష్ఠ మాసంలోనే బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. వాస్తుకు, ముహూర్తాలకు ప్రాధాన్యతను ఇచ్చే కెసిఆర్ వాస్తు మార్పులు చేసిన తరువాత బేగంపేట క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications