‘గల్లా’ వ్యాఖ్యలపై బాబు గుస్సా: చర్యలు తీసుకుంటారా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు చేరిపోయాయి. ఈ వ్యాఖ్యలపై పూర్తి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈ రోజు మధ్యాహ్నాం రాజధాని కమిటీ సభ్యులతో భేటీ కానున్న చంద్రబాబు, ఈ వ్యాఖ్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంపై నిరసన వినిపించడమే కాక ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఏమీ సాధించలేమని కూడా గల్లా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఏ విధమైన ప్యాకేజీలు ప్రకటించకపోవడంతో కొంత అసంతృప్తి చెందారని ఆయన అన్నారు.

ప్రధాని ప్యాకేజీ ప్రకటించకపోవడంపై అసంతృప్తి చెందినవారిలో తానొక్కడినని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎపికి కేంద్రం మెరుగైన ప్యాకేజీలు ఇస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. కేంద్రంతో మాట్లాడి భారీ ప్యాకేజీలు రాబట్టేందుకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా భావోద్వేగ అంశంగా మారిందని, దీనికోసం మిత్రపక్షంగా ఉండి కేంద్రంతో పోరాడలేమని జయదేవ్ అన్నారు. ప్రత్యేక హోదా రానప్పుడు రాష్ర్టానికి ఏం సాధించుకోవాలన్న దానిపై అవగాహన ఉండాలన్నారు. ఈ విషయంపై మరోసారి సీఎంతో కలిసి ప్రధానితో చర్చిస్తామని స్పష్టం చేశారు.
తాను తీసుకువచ్చిన తెనాలి కేంద్రీయ వర్శిటీని తామే తెచ్చామని ఇతరులు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శిలాఫలకంపై కేసీఆర్ పేరు వేయడంలో తప్పు లేదన్న జయదేవ్ స్థానిక సర్పంచి, ఎమ్మెల్యే, ఎంపీలను ఎందుకు విస్మరించారో తెలియదని అన్నారు.
కాగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత వైభవంగా పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిపించింది.
ప్రధాని నరేంద్ర మోడీ నోట ప్రత్యేక హోదా, ప్యాకేజీలకు సంబంధించి హామీ లభించకపోయినా, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులంతా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. శంకుస్థాపన మహోత్సవం పూర్తి కావడంతో
రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన కమిటీ సభ్యులతో శుక్రవారం మధ్యాహ్నాం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజధాని నిర్మాణ పనుల నిర్వహణ, కంపెనీని ఎంపిక చేయడం తదితర విషయాలపై ఈ భేటీలో చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications