పోలవరం కోసం మైగా ఫైట్: చిరంజీవి తొలి సంతకం
ఏలూరు: పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి భాగస్వామి అయ్యారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని తొలి సంతకం పెట్టి చిరంజీవి ప్రారంభించారు. విభజన అనంతరం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను రాబట్టడానికి కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తొలి సంతకం చేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం మిగిలిన నేతలంతా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.

విభజన చట్టంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని సూచించినా ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ప్రజలను కష్టాలకు వదిలేసిందన్నారు.
కేంద్రం నుండి రావలసిన నిధులు రాబట్టకుండా రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు పోలవరం నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతోందన్నారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications