గుజరాత్ గుడికెళ్తే నా కులం అడిగారు: కుమారి సెల్జా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ కుమారి సెల్జా రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు సభలో సోమవారం నాడు దుమారం రేపాయి. గుజరాత్‌లోని ప్రముఖ దేవాలయం ద్వారకా గుడిని సందర్శించుకునే సమయంలో తనకు చేదు అనుభవం ఎదురైందని ఆమె చెప్పారు.
తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ద్వారకా వెళ్లానని, అక్కడ తనను తన కులం గురించి అడిగారని ఆమె వాపోయారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో.. రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
నేను దళిత హిందువునని, నేను దేవాలయాలను సందర్శిస్తుంటానని, నేను వందలాది గుళ్లకు వెళ్లానని, ఓసారి ద్వారకాకు వెళ్లానని, అక్కడ తనను తన కులం గురించి అడిగారని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ మాట్లాడుతూ... తాను కూడా ద్వారకాకు వెళ్లానని, తనను ఎవరూ కులం గురించి ప్రశ్నించలేదని చెప్పారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... అలా జరిగి ఉంటే మాత్రం అది చాలా సీరియస్ విషయమని చెప్పారు. అదే సమయంలో ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి (నాటి సీఎం మోడీ), ప్రధానమంత్రి (నాటి ప్రధాని మన్మోహన్ సింగ్) దృష్టికి తీసుకు వెళ్లారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications