హోదాపై ఆ మాట బయటఅనొద్దు: సుజనకి బాబు క్లాస్
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధులను అడిగేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఢిల్లీ విమానం ఎక్కారు. ప్రధాని మోడీని ఆయన ఈ రోజు సాయంత్రం కలవనున్నారు.
ప్రధాని మోడీతో ఈ రోజు భేటీ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏమేం అడగాలి? వాస్తవానికి ఎన్ని నిధులు ఇచ్చారు? విభజన హామీలు ఎంత మేరకు నెరవేరాయి? తదితర అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. కేంద్రమంత్రులు ఇప్పటికే ప్రత్యేక హోదా పైన తేల్చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి.. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అడుగుదామని అధినేతతో చెప్పారని తెలుస్తోంది.

సుజనా చౌదరి షాకింగ్ కామెంట్లతో సమావేశంలో ఉన్న కొందరు ఆశ్చర్యానికి కూడా గురయ్యారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయమై కేంద్రంతో గట్టిగా మాట్లాడాల్సిందేనని, రాజీపడే అవసరం లేదని పలువురు నేతలు చెప్పారని అంటున్నారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో పెట్టలేదని, ఇదే ఇప్పుడు మైనస్‌గా మారిందని, కానీ ప్రత్యేక హోదా మినహా అన్ని రకాల సాయం కేంద్రే చేసేందుకు సిద్ధంగా ఉందని టిడిపి, బీజేపీ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అడుగుతామని సుజన అడిగారని అంటున్నారు. ప్రధానితో భేటీలో ప్రత్యామ్నాయం సూచిస్తే బాగుంటుందని చెప్పారట. దాని పైన చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
దీనిపై చంద్రబాబు.. సుజనకు ఘాటుగానే సమాధానం ఇచ్చారని అంటున్నారు. వాళ్ల(బీజేపీ) వాదన వాళ్లకు ఉంటుందని, మనం మాత్రం ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదులుకునే సమస్య లేదని స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని తేల్చి చెప్పరాదు. ప్రత్యామ్నాయం ఆలోచనే వద్దే వద్దని, బయట ఎక్కడా అలా మాట్లాడవద్దని చంద్రబాబు ఆయనకు గట్టిగానే చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications