తవ్వేకొద్దీ: బడా పోలీస్‌లతో నయీం స్నేహం! ఫోన్లలో ప్రముఖుల గుట్టు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో ఎన్‌కౌంటర్ అయిన నయీం కేసులో పలు ఆసక్తికర విషయాలు వెల్లవడుతున్నాయి. అతని ఆస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. నయీం ఐదేళ్లలో దాదాపు 400 ఎకరాలను ఆక్రమించినట్లుగా తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది.
అమ్మాయిల అక్రమ రవాణాలోను అతనికి భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసుల సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో నయీం అనుచరులు పరారీలో ఉన్నారు. అయిదుగురిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నయీం అన్నింటిని డైరీలో రాసుకున్నాడు. ఈ డైరీలోను షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. డైరీలో చాలామంది జాతకాలు ఉన్నాయి. అందులో ప్రజాప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారుల చిట్టా రాసుకున్నాడు. వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడేవాడు.
8 మంది బడా పోలీసు అధికారులతో సాన్నిహిత్యం?
నయీంకు పోలీసుల అండదండలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను వాడుకున్న పోలీసు అధికారులను కూడా నయీం అంతే చాకచక్యంగా ఉపయోగించుకున్నాడట. తనకు ఆపద వచ్చినప్పుడు సదరు పోలీసుల పంచన చేరవాడని, తన నీడను కూడా నమ్మని నయీం ఎనిమిది మంది ఖాకీ బాస్‌లకు కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడని వార్తలు వస్తున్నాయి.

ఓ భువనగిరి డివిజన్‌లోని పోలీసు స్టేషన్లను దత్తత తీసుకోవాలనుకున్నా సాధ్యం కాలేదని వార్తలు వస్తున్నాయి. నయీంకు సీఐ స్థాయి అధికారి నుంచి బాస్‌ల వరకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. పోలీసులకు నయీం కార్లు, భూములు బహుమతులుగా ఇచ్చారని అంటున్నారు.
నయీం సమాచారంతో నక్సల్ నేతలను మట్టుబెట్టి కొందరు పోలీసులు ప్రమోషన్లు, రివార్డులు అందుకున్నారని అంటున్నారు. అతను రియల్ ఎస్టేట్ వైపు వెళ్లడంతో అక్కడ కూడా అతనిని ఉపయోగించుకున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో నయీంతో సెటిల్మెంట్లు చేయించిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు.
నయీం ఇంట్లో లభించిన దస్తావేజులు హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాలకు చెందినవని పోలీసులు భావిస్తున్నారు. కాగా, దర్జాగా ఖరీదైన ఎండీవర్ వాహనంలో వచ్చిన నయీం, శవమై తుఫాన్ వాహనంలో వెళ్లాడు.
షాద్ నగర్లోని నయీం స్నేహితుడు పాషా ఇంట్లో 40కి పైగా చైనా సెల్‌ఫోన్‌లు, 180కిపైగా సిమ్‌లు లభ్యమయ్యాయి. ఈ ఫోన్‌లు స్థానిక దుకాణాల్లోనే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఐఎంఈఐ నంబర్ల వివరాలు సరిపోలవనే చైనా ఫోన్లను ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లలో పలువురు ప్రముఖుల జాతకాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫోన్ల ద్వారానే బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
వారి గుండెల్లో రైళ్లు
నయీం డైరీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లు పోలీసులు సేకరించారు. వాటిని పరిశీలిస్తున్నారు. వీటిల్లో నయీంతో సంబంధాలు ఉన్న పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ఐపీఎస్‌లు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.












Click it and Unblock the Notifications