సూపర్ ఐడియా: కాగితాలే కరెన్సీ-అక్కడ ‘పెద్ద నోట్ల’ ఇక్కట్లే లేవు!
మిజోరాంలోని ఓ గ్రామంలో మాత్రం కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అదేంటంటే.. కాగితం ముక్కలనే కరెన్సీ నోట్లగా మార్చి క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ఐజ్వాల్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ప్రజలందరిపైనా ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు ఈ నిర్ణయంతో తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు కూడా కష్టంగా మారింది. చెలామణిలో ఉన్న డబ్బుల కోసం తెల్లారితోచాలు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. కాగా, మిజోరాంలోని ఓ గ్రామంలో మాత్రం కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.
అదేంటంటే.. కాగితం ముక్కలనే కరెన్సీ నోట్లగా మార్చి క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అందరిలాగే మిజోరంలోని కావ్‌బంగ్ గ్రామ ప్రజలు కూడా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇబ్బందులను ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలోనే వచ్చిన ఆలోచనతో.. ప్రాచీన కాలంలో జరిగిన వస్తుమార్పిడి స్ఫూర్తితో కరెన్సీకి బదులు ఇప్పుడు తెల్లటి కాగితాలను వినియోగిస్తున్నారు. నాటి కాలంలో వస్తువులు అమ్మేవారికి ఇచ్చే డబ్బు మొత్తాన్ని కాగితంపై రాసి సంతకం చేసి వస్తువుల్ని తెచ్చుకుంటున్నారు.

డబ్బులు అందుబాటులోకి వచ్చాక ఎవరికి తెల్ల కాగితాలు ఇచ్చారో వారికి డబ్బులిచ్చేస్తారట. ఈ ఆలోచన గ్రామంలోని హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్న పీసీ లాల్ మచునా అనే వ్యక్తికి వచ్చింది. గ్రామ ప్రజలు డబ్బుల కోసం ఇబ్బందులు పడటం చూసిన లాల్.. నోట్ల అంశం సద్దుమణిగే వరకు ఇదే ప్రత్యామ్నాయమని భావించాడు.
వెంటనే గ్రామస్థులతో మాట్లాడి వారిని ఒప్పించి తన ఆలోచనని అమల్లోకి తీసుకొచ్చాడు. దుకాణాల్లో, మార్కెట్లో ఈ కాగితాలు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామంలో తెల్ల కాగితాలే కరెన్సీ నోట్లగా చెలామణి అవుతున్నాయి. ఇలా ఆ గ్రామంలోని ప్రజలందరూ తమ నోట్ల ఇక్కట్లను తొలగించుకున్నారు. ఈ ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మనసుంటే మార్గముంటుందనడానికి ఇదే నిదర్శనం అవుతుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో పుట్టిన ఈ నూతన(పాత) ఆలోచన చాలా మందిని ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications